వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! | Sakshi
Sakshi News home page

వైద్యంలో ఒకప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!

Published Wed, Oct 12 2022 1:12 PM

Vanam Jwala Narasimha Rao Write on Changes in Health Care Services - Sakshi

ఇటీవల చిన్న ఆరోగ్య సమస్య వస్తే సంప్రదించడానికి బాగా పరిచయం, వైద్య వృత్తిలో ఐదారు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం, ఎండీ జనరల్‌ మెడిసిన్‌ డిగ్రీ ఉన్న ఒక సీనియర్‌ జన రల్‌ ఫిజీషియన్‌ దగ్గరికి వెళ్లాం. డాక్టర్‌  చాలా విపులంగా పరీక్ష చేశారు. బహుశా ఆయన స్పెషలిస్ట్‌ కాకపోవడం వల్లనే ఇలా పరీక్షించగలిగారు. అదే ఏ స్పెషాలిటీ ఆసుపత్రికో కన్సల్టేషన్‌ కు పోతే ఆ అనుభవమే వేరు. రోగి వంటిమీద ఏ స్పెషలిస్టయినా చెయ్యి వేయడం కానీ, స్టెత్‌ పెట్టి చూడడం కానీ సాధారణంగా ఉత్పన్నం కాదు. 

స్పెషలిస్టుల అప్పాయింట్‌మెంట్‌ దొరకడం, కలవడం ఒక ప్రహసనం. భారీ మొత్తంలో కన్సల్టేషన్‌ ఫీజ్‌ చెల్లించుకుని, గంటలకొద్దీ వెయిట్‌ చేసి, బయటనే పారా మెడికల్‌ వ్యక్తితో బీపీ, సాచ్యురేషన్, బరువు ఇత్యాదులు చూపించుకుని, స్పెషలిస్టును కలిసీ కలవడంతోనే సమస్య విని, తక్షణమే ఖరీదైన డయాగ్నాస్టిక్‌ పరీక్షలు చేయించాలి అంటారు చాలామంది. రిపోర్టులు వచ్చిన తరువాత చాలా మంది స్పెషలిస్టులు పూర్తిగా వాటి ఆధారంగా చికిత్స మొదలు పెట్టడమే కాని క్లినికల్‌గా కోరిలేట్‌ చేసుకోవడం ఆరుదేమో అనాలి. పెద్ద పెద్ద సూపర్‌ స్పెషలిస్టుల దగ్గర, వాళ్లు చూడడానికి ముందు ఒక సహాయక డాక్టర్‌ రోగి వివరాలు తీసుకుంటారు. ఆ వివరాల మీదా, రేడియాలజీ, పాథాలజీ పరీక్షల రిపోర్టుల మీదా ఆధారపడి సాగు తున్నది ఆధునిక వైద్యం. ఇది మంచిదా కాదా అంటే జవాబు చెప్పగలిగేవారు ఆ రంగానికి చెందిన నిపుణులే.

వైద్యరంగంలో వచ్చిన, వస్తున్న పెనుమార్పులు, అభివృద్ధి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆహ్వానించాల్సిందే కాని, వాటి మరో కోణం కొంత ఆందోళనకు దారి తీస్తుంది అనడం తప్పుకాదేమో! ఒకప్పుడు కేవలం ఎంబీబీఎస్‌ చదువుతో ఆపి ప్రభుత్వ ఉద్యోగమో, ప్రయివేట్‌ ప్రాక్టీసో చేసుకునేవారు. ఎక్కువలో ఎక్కువ జనరల్‌ మెడిసిన్, లేదా జనరల్‌ సర్జరీ చదివేవారు. వారిదగ్గరికి పోయిన రోగికి చికిత్స చేసే క్రమంలో రోగి నాడి చూడడం దగ్గరనుండి, స్టెతస్కోప్‌ వంటిమీద పెట్టి రోగ నిర్ధారణ చేయడంతో సహా, బీపీ చూడడం, అవసరమైన వారికి స్వయంగా ఇంజక్షన్‌ ఇవ్వడం, కట్టు కట్టడం లాంటి అనేకమైన వాటిని డాక్టర్‌ స్వయంగా చేసేవాడు. రోగికి ఎంతో తృప్తి కలిగేది. వారే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేసేవారు. ఎప్పుడైతే స్పెషలిస్టులు వైద్య రంగంలో పెరిగిపోసాగారో, ఒక్కో రుగ్మతకు ఒక్కో డాక్టర్‌ అవసరం పెరగసాగింది.  

ఈ నేపథ్యంలో, ఎంబీబీఎస్‌ తప్ప అదనపు స్పెషలిస్ట్‌ క్వాలిఫికేషన్‌ లేని ప్రజా వైద్యుడు, 50–60 సంవత్సరాల క్రితమే వృత్తిపరంగా రోగుల అన్నిరకాల రుగ్మతలకు తన అనుభవాన్ని ఆసాంతం రంగరించి చికిత్స చేసిన మహా మనీషి, ఖమ్మం జిల్లా వాసి, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్‌ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్కే) అనుభవం నుంచి ప్రతి వైద్యుడూ నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. ఖమ్మం పట్టణానికి రాధాకృష్ణమూర్తి వచ్చి ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో, ‘స్పెషలిస్టు’ డాక్టర్లంటూ ఎక్కువ మంది లేరు. అధికశాతం జనరల్‌ ప్రాక్టీషనర్లే. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులైన వారే. ప్రముఖులతో సహా పలువురికి, ఆయన అప్పటికున్న సదుపాయాల ఆధారంగానే, టాన్సిల్స్‌ ఆపరేషన్‌ చేశారు. బహుశా ఖమ్మం పట్టణంలో మొదటి టాన్సిల్‌ ఆపరేషన్‌ చేసింది ఆయనేనేమో. అలాగే వేసెక్టమీ ఆపరేషన్లు ఖమ్మంలో ప్రారంభించిది కూడా ఆయనే. డాక్టర్‌ రాధాకృష్ణమూర్తి చేసిన ఆపరే షన్లలో, ఈ రోజుల్లో స్పెషలిస్ట్‌ వైద్యులు మాత్రమే చేస్తున్న హైడ్రోసిల్, హెర్నియా, అపెండిసైటిస్, ఫ్రాక్చర్స్, ట్యూమర్‌ లాంటివి కూడా వున్నాయి. ఎవరూ చేపట్టని ధనుర్వాతం కేసులకూ ఆయన చికిత్స అందించేవారు.   

అప్పట్లో క్షయ వ్యాధి చికిత్సకు ఒక క్రమ పద్ధతి అవలంబించారు రాధాకృష్ణమూర్తి. ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే ‘ఆర్టిఫీషియల్‌ న్యూమో థొరాక్స్‌’ అనే విధానం ద్వారా, ఊపిరి తిత్తులను ‘కొలాప్స్‌’ చేసే పద్ధతి పాటించే వారు. ఎముకలు విరిగినవారికి ప్లాస్టర్‌ వేసి బాగు చేయడం డాక్టర్‌ రాధాకృష్ణమూర్తి ఒక ప్రత్యేక నైపుణ్యంగా అలవరచుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేర్చుకున్న దానిని, మరింత పదును పెట్టడానికి, నిరంతర అధ్యయనం చేసేవారాయన. 

ఇంకా కొంచెం వెనక్కు పొతే, ఆర్‌ఎంపీల ప్రాక్టీసు చేసిన రోజులు జ్ఞప్తికి వస్తాయి. నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా ‘సుస్తీ‘ చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము–తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలికా వైద్యులు, ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. వారిలో కొందరికి ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్‌ ఫ్లుయెంజా, మలేరియా–చలి జ్వరం) ఏపీసీ ట్యాబ్లెట్లు ఇచ్చేవారు. గ్రామాలలో ‘గత్తర’ (కలరా), ‘స్పోటకం– పాటకం’ (స్మాల్‌ పాక్స్‌) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు ‘దద్దులు’, ‘వంచెలు’ కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, ‘టీకాలు’ వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. ఊళ్లో ఏవైనా సీరియస్‌ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని సమీపంలోని పట్టణానికి పోయే వాళ్లు. వారి వెంట (ఆర్‌ఎంపీ) డాక్టర్‌ కూడా వెళ్లేవాడు. (క్లిక్ చేయండి: ‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి)

ఇప్పుడైతే ప్రతిచోటా వందలాది మంది ఎంబీబీఎస్‌ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్‌ స్పెషలిస్టులు, మల్టీ సూపర్‌ స్పెషలిస్టులు, వందల–వేల నర్సింగ్‌ హోంలు, సూపర్‌ స్పెషాలిటీ– మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు; వాటికి ధీటుగా, మరింత మెరుగ్గా ప్రభుత్వ రంగంలో, వివిధ అంచెలలో అన్నిరకాల వైద్యసేవలు, అందరికీ ఉచి తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. డయాగ్నాస్టిక్‌ పరీక్షలన్నీ ప్రభుత్వ పరంగా అన్ని స్థాయి ఆసుపత్రులలో ఉచితంగా లభ్యమవు తున్నాయి. భవిష్యత్తులో, బహుశా క్వాలిఫైడ్‌ డాక్టర్‌ లేని గ్రామం వుండదంటే అతిశయోక్తి కాదేమో! అయినా ఎక్కడో, ఎందుకో, ఏదో కానరాని వెలితి! (క్లిక్ చేయండి: కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!)


- వనం జ్వాలా నరసింహారావు 
తెలంగాణ ముఖ్యమంత్రి చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌

Advertisement
Advertisement