'మావిగన్‌'లో అమరావతి పదిలం! | Sakshi Guest Column On Mavigun and Amaravathi | Sakshi
Sakshi News home page

'మావిగన్‌'లో అమరావతి పదిలం!

Apr 14 2026 12:09 AM | Updated on Apr 14 2026 12:13 AM

Sakshi Guest Column On Mavigun and Amaravathi

అభిప్రాయం

ఒక రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్ర పరిధికి చెందిన అంశం. సంబంధిత ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం గుర్తిస్తుంది. ఇది ఒక సాధారణ ప్రక్రియ. కానీ ఏపీలో ఈ అంశాన్ని అసాధారణ అంశంగా మార్చివేసింది కూటమి ప్రభుత్వం. ఇంత ప్రయాస ఎందుకు? అమరావతి ఏకైక రాజధాని స్థానంలో మూడు రాజధానుల ఆలోచనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేయడం! జగన్‌ కోసమే రాజధానికి చట్టబద్ధత అన్నట్లు ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ సందర్భంగా జగన్‌ ‘మావిగన్‌’ ప్రతిపాదన చేశారు. 

రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సీట్‌ రాజధాని అనీ, అంతకుమించి రాజ్యాంగంలో రాష్ట్ర రాజధానిపై ఎలాంటి వ్యాఖ్యానాలూ లేవని కేంద్ర ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. అంతెందుకు, 2014 నుంచి 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్‌. నిత్యం అమరావతి రాజధాని అంటున్నారు కానీ ప్రభుత్వ ఆదేశాలు, జీఓలు అన్నీ వెలగపూడి పేరుతో వచ్చాయి. వెలగపూడి రాజధాని కాదు కానీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సీట్‌ సచివాలయం వెలగపూడిలో ఉన్నది కాబట్టి ఆ పేరుతోనే ఆదేశాలు జారీ అయ్యాయి.

రాజధాని వేరు, నూతన నగరం వేరు!
అమరావతి రాజధాని మారకూడదు అంటే చట్టంతో సాధ్యం కాదు. నిజంగా అమరావతి రాజధానిని మార్చకూడదు అనుకుంటే జగన్‌ మావిగన్‌ ప్రతిపాదన గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అమరావతి రాజధానిలో విజయవాడ, గుంటూరు లేవు. కానీ మావిగన్‌లో అమరావతి ఉన్నది. అంటే జగన్‌ అధికారంలోకి వచ్చాక మావిగన్‌ అమలు చేసినా అమరావతికి ఎలాంటి నష్టం ఉండదు. రాజధానినీ, నూతన నగరాన్నీ మిళితం చేయడం వల్లే ఏపీలో రాజధాని అంశం వివాదం అవుతున్నది. రాజధాని అంటే పరిపాలనా కేంద్రం, అందుకు కావాల్సిన కార్యాలయాలు ఏర్పాటు. కానీ ఏపీ ప్రభుత్వం రాజధాని చుట్టూ నూతన మహానగర నిర్మాణానికి పూనుకున్నది. ఇది ఆచరణలో సాధ్యమా? నూతన నగరాల అనుభవాలు ఏమి చెబుతున్నాయి అన్నది ముఖ్యం.

దేశంలో మొదటి ప్రణాళికబద్ధ నగరం చండీగఢ్‌. పంజాబ్, హరియాణాలకు ఉమ్మడి రాజధాని. కేంద్ర పాలిత ప్రాంతం. 60 సంవత్సరాల క్రితం ప్రారంభం అయింది. ప్రస్తుత జనాభా 11 లక్షలు. ఇది గుంటూరు జనాభాతో సమానం. మరో నూతన నగరం నయా రాయపూర్‌ 25 సంవత్సరాల క్రితం ప్రారంభం అయితే ప్రస్తుత జనాభా 5.6 లక్షలు. పుణెకు సమీపంలో ఏఇఇ కంపెనీ వారు 25 వేల ఎకరాలలో నూతన నగర నిర్మాణం, భవనాలు పూర్తి చేశారు. 3 లక్షల జనాభా అంచనాతో నిర్మించిన లవాసా నిర్మాణం పూర్తయినా ప్రస్తుత జనాభా రెండు వేలు మాత్రమే. స్థూలంగా నూతన నగరాలు రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. ఒక వేల నిర్మాణం చేసినా ప్రజలు రావడానికి పరిమితులు ఉన్నాయి. 

రాజధానితో సంపద సృష్టి భ్రమే!
అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదు, నూతన నగరం. అదికూడా ప్రపంచంలో ఐదో స్థానం, దేశంలో మొదటి స్థానం అంటే హైదరాబాద్, ఢిల్లీకి మించిన నగర నిర్మాణం. రాజధానికి కావలసిన కార్యాలయాల ఏర్పాటు వరకే పరిమితం అయితే ఒక లెక్క. రాజధాని కార్యాలయాల నిర్మాణం అంతా కలిపి సాధారణ స్థాయిలో చేసినా రూ. 1.5 లక్షల కోట్లు అవుతుంది. అదే ప్రభుత్వ అంచనా అయితే 2 లక్షల కోట్లు అవుతుంది. పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌ తదితర వాగుల వరద ముప్పు నుంచి నూతన ప్రతిపాదిత నగర రక్షణ కోసం దాదాపు 10 వేల కోట్లు ఖర్చు చేయాలి. 

రాజధానిలో కొంత భూమి విక్రయం ద్వారా ఆదాయం పొందాలి అనుకున్నా మొదట 1.5 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. కాలం జరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. మరి లక్షల కోట్లు పెట్టుబడి భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నదా? అప్పు చేయకపోతే జీతాలు ఇవ్వలేని ఆర్థిక స్థితిలో ఉన్న ప్రభుత్వం ఇంత భారంతో నూతన నగర నిర్మాణానికి పూనుకోవడం శ్రేయస్కరమా? అప్పు చేసి నగర నిర్మాణం చేసినా ప్రతిపాదిత నగరానికి అత్యంత సమీపంలో విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఈ రెండు నగరాలకు సంబంధం లేకుండా కొత్త నగర నిర్మాణం చేసినా నోయిడా, లవాసాల పరిస్థితి ఉత్పన్నం కాదా?

రాజధాని ద్వారా సంపద సృష్టి అనేది ఊహాజనితం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలను పరిశీలిస్తే అవి రాజధానులు కావడం వల్ల సంపద వస్తున్నదా? అక్కడ ఉన్న ఐటీ, తదితర సంస్థల వల్ల సంపద వస్తున్నదా? రాజధాని నగరాలే సంపదకు మూలం అయితే గాంధీనగర్, చండీగఢ్, భోపాల్‌ నుంచి సంపద ఎందుకు రాలేదు? కంపెనీలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి మాత్రమే సంపద సృష్టి జరుగుతుంది తప్ప రాజధాని వల్ల కాదు. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో కూడా విశాఖలోనే వస్తున్నాయి. మరి అమరావతిలో ఏ సంస్థలు వస్తాయి? కంపెనీలు రాకుండా రాజధాని ఎంత పెద్ద స్థాయిలో నిర్మాణం చేసినా సంపద సృష్టి ఎలా సాధ్యం?

నిధుల సమస్య తీరే ప్రతిపాదన
జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు... మధ్యలో మంగళగిరి, తాడేపల్లితో పాటు నూతన ప్రతిపాదిత అమరావతి నగరం కలిసే ఉంటాయి. మావిగన్‌ ప్రతిపాదిత ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 10–15 వేల కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయవచ్చు. నూతన రాజధాని నగరం 40 లక్షల జనాభాతో ప్రారంభం అవుతుంది. సమీపంలో ఉన్న ప్రాంతాలు క్రమేణా రాజధానిలో కలిసిపోతాయి. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలుగా మారిన తర్వాత వాటికి ఆనుకునివున్న కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్, శంషాబాద్, గచ్చిబౌలి కలిసిపోవడంతో హైదరాబాద్‌ మహా నగరంగా విస్తరిస్తూనే ఉన్నది. 

హైదరాబాద్, సికింద్రాబాద్‌ కన్నా చుట్టూవున్న ప్రాంతాలే అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయి. మావిగన్‌ కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో ప్రారంభమై క్రమేణా అమరావతితో సహా మిగిలిన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేకంగా నగర నిర్మాణం అవసరం ఉండదు. మావిగన్‌లో అమరావతి కూడా అంతర్భాగంగా ఉంటుంది. కనుక రాజధాని మార్పు అంశం ముగిసిన అధ్యాయంగా  మారుతుంది. ఆ రకంగా మావిగన్‌లో అమరావతి పదిలం!

ఇక అమరావతి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర వనరులు, అప్పులతో చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రతో సహా ఇతర ప్రాంతాల అభివృద్ధికి నిధుల సమస్య తలెత్తుతుంది. అదే మావిగన్‌ అయితే స్వల్ప వనరులతో రాజధానికి కావలసిన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మిగిలిన వనరులను ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదన చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మావిగన్‌ ప్రతిపాదనను పరిశీలించాలి. ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరగాలి. 

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement