రాయని డైరీ.. నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా సీఎం) | Rayani dairy By Madhav Singaraju On Odisha CM Naveen Patnaik | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. నవీన్‌ పట్నాయక్‌ (ఒడిశా సీఎం)

May 20 2024 11:21 AM | Updated on May 20 2024 11:21 AM

Rayani dairy By Madhav Singaraju On Odisha CM Naveen Patnaik

‘‘జూన్‌ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్‌ జీ! ఫిక్స్‌ చేసేశాను’’ అన్నారు 
పాండియన్‌!
నవ్వాన్నేను.
ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే 
ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్‌లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. 
అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్‌లో నీడ
పట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.
‘‘జూన్‌ 9న ప్రమాణ స్వీకారం పెట్టు
కుందాం నవీన్‌ జీ! ఫిక్స్‌ చేసేశాను’’ అని 
పాండియన్‌ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్‌ ఆ మాటను నాతో 
అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్‌ మొదలు 
కావటానికి వారం ముందే!
ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్‌ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్‌ని నిర్ణయించేసింది ఎలక్షన్‌ కమిషన్‌! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత 
పోలింగ్‌. మే 25, జూన్‌ 1 మూడు, నాలుగు 
విడతలు. జూన్‌ 4న ఫలితాలు.
‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్‌ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్‌ ఫైల్‌ మీద మొదటి 
సంతకం చేస్తారు’’ అని పాండియన్‌ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.
‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్‌ 4 ఎక్స్‌పైరీ డేట్‌’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్‌ జూన్‌ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్‌ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. 
నా రెండో నేను!
ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా 
చూసుకుంటారు!
మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్‌ పట్నాయక్‌ దేశంలోనే పాపులర్‌ సీఎం అని; వికసిత్‌ భారత్‌కి, ఆత్మనిర్భర్‌ భారత్‌కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్‌ ప్రభుత్వానికి జూన్‌ 4 ఎక్స్‌పైరీ డేట్‌ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం 
చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా 
ఉంటారా ఒడిశా ప్రజలు?!
‘‘ఒడిశా నవీన్‌ పట్నాయక్‌కి గుడ్‌ బై 
చెప్పబోతోంది’’ అని అమిత్‌ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్‌ పట్నాయక్‌కి రెస్ట్‌ ఇవ్వబోతున్నారు’’ 
అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రచారం చేస్తున్నారు!
మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. 
పాండియన్‌ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!
‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్‌! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్‌లో మరోవైపునకు నడుస్తూ!
అవును కదా అన్నట్లు పాండియన్‌ నవ్వారు.  
గెలుపోటములన్నవి నాయకులు ఒక
ర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. 
‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు.  

  • మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement