‘ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో చారిత్రక తప్పిదం’ | A Historical Error in AU Centenary Celebrations | Sakshi
Sakshi News home page

‘ఏయూ శతాబ్ధి ఉత్సవాల్లో చారిత్రక తప్పిదం’

Apr 28 2026 12:59 PM | Updated on Apr 28 2026 1:25 PM

A Historical Error in AU Centenary Celebrations

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వార్షికోత్సం జరుగుతున్నందుకు సంతోషమే. ఈ సందర్భంలో ఈ యూనివర్శిటీ స్థాపన జరిగిన తీరు, అందుకు కృషి చేసిన  మహానుభావులను స్మరించుకోవడం అవశ్యం. లక్షలాది మంది విద్యార్ధులకు విద్యావకాశాలు కల్పించిన ఆంధ్ర యూనివర్శిటీ ఇప్పటికీ సమున్నతంగా వెలుగుతోంది. శతాబ్ది ఉత్సవాలలో ప్రసంగించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు కొన్ని చారిత్రక అంశాలను  ప్రస్తావించినట్లు కనిపించలేదు. అందుకే చరిత్ర కొంత గుర్తు చేయడం అవసరం అనిపిస్తోంది..

ఈ యూనివర్శిటీని స్థాపించడానికి పానగల్ మహారాజు కారణమని చెప్పాలి. ఈయన గొప్పదనం గురించి అతిధులు మాట్లాడినట్లు కనిపించలేదు. ఆంధ్ర విశ్వ విద్యా పరిషత్తు ను స్థాపించాలని కోరుతూ ప్రఖ్యాత స్వాతంత్ర యోధులు, తెలుగు నేతలు ప్రకాశం పంతులు ,కొండా వెంకటప్పయ్య పంతులు తదితరులు ఆంధ్ర మహాసభల ద్వారా ప్రజలను చైతన్యపరచేవారు. ఆ దశలో పానగల్లు రాజా పానుగంటి వెంకట రాయనం మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (1925- 28) ఎన్నికయ్యారు. ఆయన చొరవ చూపించి, ఆంధ్ర నేతల డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుని ఆంధ్ర యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ ప్రతిపాదనను తమిళ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించినా ఈయన  ముందుకు తీసుకువెళ్లారు. 

ఈ యూనివర్శిటీని  ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు కొంతమంది రాయలసీమను సూచించారు. కాని అన్నిటిని పరిగణనలోకి తీసుకున్న పానగల్ రాజా దీనిని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తన రాజకీయ ప్రత్యర్ధి అయిన సర్ సీఆర్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి సహకరించాలని కోరారు. అప్పటికే ప్రముఖ విద్యావేత్తగా పేరొందిన సీఆర్ రెడ్డి అందుకు అంగీకరించడంతో ఈ యూనివర్శిటీ ఏర్పాటు సాధ్యమైంది. తొలి వీసీగా ఉండాలని రాజా కోరడం, సీఆర్ రెడ్డి సిద్దపడడం విశేషం. 

ఈ సందర్భంగా సీఆర్‌ రెడ్డి పానగల్‌ రాజాగారికి ఒక సలహా ఇచ్చారు. యూనివర్శిటీ పెట్టాలంటే కాలేజీలు అవసరం అని.. కాలేజీలకు హైస్కూళ్లు అత్యవసరం అవుతాయని చెప్పారు. ఈ కారణంగా ప్రతి తాలూకా కేంద్రంలో ఒక హైస్కూలును ఏర్పాటు చేయాలన్న సీఆర్‌ రెడ్డి సలహాను పానగల్‌ రాజా గారు పాటించారు. (అప్పట్లో కృష్ణా జిల్లాలో బందరు, విజయవాడల్లో హైస్కూళ్లు ఉండేవి. రాజా గారి నిర్ణయం కారణంగా ప్రతి తాలూకా కేం‍ద్రంలో ఒక హైస్కూల్‌ ఏర్పాటైంది.) ఈ చర్య వల్ల ఆంధ్ర ప్రాంతంలో విద్యావ్యవస్థకు బలమైన పునాది పడింది.

తదుపరి 1926లో యూనివర్శిటీ ఏర్పాటు జరిగింది. మౌలిక వసతులు వచ్చేవరకు తాత్కాలికంగా విజయవాడలో నిర్వహించి తదుపరి విశాఖకు తరలించారు. సీఆర్‌ రెడ్డి తర్వాత ప్రముఖ విద్యా వేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్   వైస్ చాన్సలర్‌గా నియమితులై అనన్యమైన సేవలు అందించారు.  తదనంతర కాలంలో ఆయన రాష్ట్రపతి అయిన సంగతి తెలిసిందే.  

ఇలాంటి మహనీయుల కృషి వల్ల కోస్తా, రాయలసీమలలోని పలు జిల్లాలలో కాలేజీలు హైస్కూళ్లు స్థాపితం అయ్యాయి. ఇందుకు పలువురు జమిందార్ రాజాలు కూడా సహకరించారు. పర్లాకిమిడి జిల్లాలోని జైపూర్ మహారాజు  విక్రమ్ దేవ్ విశాఖలో యూనివర్శిటీ భవనాల నిర్మాణానికి ఆర్ధిక సాయం చేశారు. అందుకు కృతజ్ఞతగా యూనివర్శిటీ ప్రాంగణంలో ఆయన  విగ్రహం కూడా పెట్టారు. ఆంధ్ర యూనివర్శిటీ స్థాపనకు కారకుడైన  పానగల్ మహారాజ తన విగ్రహం వద్దని, విక్రమ్ దేవ్ విగ్రహం పెట్టాలని సూచించడం ఆయన ఔదార్యానికి నిదర్శనం. శతవార్షికోత్సవం సందర్భంగా ఈ చరిత్ర ప్రజలకు తెలియాలని ఆశిస్తున్నాను.

:::దేవులపల్లి గోపాలరావు, హైకోర్టు న్యాయవాది

Advertisement
 
Advertisement
Advertisement