విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం! | Stray Dog Refuses to Leave Deceased Woman's Grave in Kerala | Sakshi
Sakshi News home page

విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం!

Apr 29 2026 12:10 PM | Updated on Apr 29 2026 12:23 PM

Stray Dog Refuses to Leave Deceased Woman's Grave in Kerala

మలప్పురం: మనిషికి, మూగజీవికి మధ్య ఉండే బంధం కేవలం అన్నం పెట్టే దగ్గరే ఆగిపోలేదు.. అది రెండు ఆత్మల అనుసంధానమని కేరళలోని మలప్పురం సాక్షిగా మరోసారి రుజువైంది. ఎడవన్న ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు, తన ఇంటి ముందుకు వచ్చే ఒక వీధి కుక్కకు రోజూ ప్రేమతో అన్నం పెట్టేది. ఈ నేపధ్యంలో ఆ మూగజీవికి ఆమె ప్రాణప్రదమైన స్నేహితురాలిగా మారిపోయింది. అమీనా చూపిన ఆదరణను ఆ మూగ జీవి గుండెల్లో పదిలంగా దాచుకుంది.

ఒక రోజు అమీనా తన ఇంటి బయట అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినప్పుడు ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. తన ప్రాణదాత ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేక, ఆ వీధి కుక్క ఆపకుండా అరుస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. దాని అరుపులు విని, స్థానికులు స్పందించే లోపే, అమీనా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఆ మూగ జీవి తనను ఆదుకున్న యజమాని ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.

అమీనా అంతిమ యాత్ర మొదలైనప్పుడు, ఆ కుక్క కూడా అందరితో కలిసి మౌనంగా అడుగులు వేసింది. మసీదు శ్మశానవాటిక వరకు ఆ భౌతికకాయాన్ని అనుసరిస్తూ వెళ్లి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోయింది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ కుక్క శ్మశానవాటిక పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. బహుశా ఆ మూగజీవికి అమీనా దూరం కాబోతోందనే ముందస్తు సంకేతం అందిందేమోనని పలువురు కంటతడి పెట్టుకున్నారు.

అంత్యక్రియలు ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ శునకం తన యజమానిని మరువలేకపోతోంది. అమీనా కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాధిని సందర్శించడానికి వచ్చినా, ఆ కుక్క అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఎటువంటి అలికిడి చేయకుండా, ఆమె సమాధి పక్కనే గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని నిరీక్షిస్తోంది. తన ఆకలి తీర్చిన మనిషి తిరిగి రాదని తెలిసినా, ఆ సమాధి వద్ద అది చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ.. అందరికీ  ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని..

Advertisement
 
Advertisement
Advertisement