పిల్ల మాస్టారు

Family Little Master - Sakshi

ఆరేళ్ల లోపు పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌ని ఆరేళ్లు దాటిన పిల్లలకు పాఠాలు చెప్పడానికి మారిస్తే ఆ టీచర్‌ హెచ్చించబడినట్లా, తగ్గించబడినట్లా? ఆ హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా సిల్వెయిన్‌ హెలయిన్‌ తను పోగొట్టుకున్న దానిని తిరిగి రాబట్టుకునేందుకు రోజూ స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ను కలుస్తున్నాడు. నా కిండర్‌గార్టెన్‌ పిల్లల క్లాస్‌ని నాకు తిరిగి ఇచ్చేయండి అని ప్రాధేయపడుతున్నాడు. సిల్వెయిన్‌కి 35 ఏళ్లు. అప్పుడే బడిలో చేరిన బ్యాచ్‌ ఒకటి ఉంటుంది కదా ప్రతి ఏడాది.. వారికి పాఠాలు చెప్పడం అతడికి మహా ఇష్టం. కోతివేషాలతో వాళ్లను  నవ్విస్తాడు. కథలు చెబుతున్నప్పుడు నిద్రకు తూలుతుంటే బ్లాంకెట్‌ పరిచి పడుకోబెడతాడు. ఇటీవలే సెలవులు అయ్యాక విచిత్ర ఒంటిఅలంకరణతో బడికి వచ్చాడు.

ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడు. కనుగుడ్ల రంగును నల్లగా మార్పించుకున్నాడు. ఇందాక మనం ఒక విషయం మర్చిపోయాం. నవ్వించడం, నిద్రపుచ్చడం మాత్రమే కాదు, ఆడిస్తుంటాడు కూడా సిల్వెయిన్‌. ఒంటిపై షర్ట్‌ తీసి ‘కమ్‌ ఆన్‌.. లెటజ్‌ ప్లే’ అన్నాడు.. స్కూలు తెరవగానే పిల్లల కన్నా ముందే క్లాస్‌ రూమ్‌కి వచ్చేసి. పిల్లలు ఒక్కక్షణం అతడిని పరిశీలనగా చూసి మూతి గట్టిగా బిగబట్టి ఏడుపుకు రెడీ అయిపోయారు. మర్నాడే పేరెంట్స్‌ నుంచి కంప్లయింట్స్‌. ఆ టీచర్‌ని మార్చేయమని! పిల్లలకు రాత్రిళ్లు పీడకలలు వచ్చి నిద్రలేచి ఏడుస్తున్నారట. కానీ ‘ఐ లవ్‌ మై జాబ్‌’ అంటున్నాడు సిల్వెయిన్‌. హెడ్‌ మాస్టర్‌ మాత్రం అతడికి పిల్లల్ని ఇవ్వలేదు. అదే.. పిల్లల క్లాస్‌ని ఇవ్వలేదు.

ప్యారిస్‌ శివార్లలోని ఆ ఎలిమెంటరీ స్కూల్‌ పేరు ఏదైతే ఉందో అది సిల్వెయిన్‌ వల్ల ఫ్రాన్స్‌ అంతటికీ తెలిసింది కానీ, అతడి భయానికి స్కూల్‌ మానేసిన చంటి పిల్లల్ని మాత్రం వాళ్ల తల్లిదండ్రులు మళ్లీ ఆ ఛాయలకు కూడా తీసుకురాలేక పోతున్నారు. ‘పిల్లల కేరింతల కోసమే 460 గంటలు కష్టపడి టాటూలు పొడిపించుకున్నాను. పిల్లలు కాదు, నన్ను చూసి పెద్దలే పిల్లల వెనుక దాక్కుని వాళ్లను స్కూల్లో విడిచి పెట్టడానికి వస్తున్నట్లుగా ఉంది’ అని సిల్వెయిన్‌ చిన్నపిల్లాడిలా ఆక్రోశిస్తున్నాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top