ఏపీలో ‘పెట్రో’ కటకట! | Sakshi Editorial On Petrol, Diesel Issue In AP with Chandrababu Govt | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘పెట్రో’ కటకట!

Apr 28 2026 12:45 AM | Updated on Apr 28 2026 12:45 AM

Sakshi Editorial On Petrol, Diesel Issue In AP with Chandrababu Govt

స్వోత్కర్షలకూ, చేదు వాస్తవాలకూ మధ్య తేడా ఎంత ఉంటుందో తెలియజెప్పే వైనమిది. ‘మా రాష్ట్రానికి రండి... పెట్టుబడులు పెట్టండి. మా సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా మీరే తెలుసుకోండి’ అంటూ శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల ఉత్సవంలో గప్పాలు కొట్టుకున్న క్షణానికే రాష్ట్రం మొత్తం ఇంధన కొరతతో అల్లాడిపోయింది. అన్ని జిల్లాల్లోనూ బంకులముందు ఆ రోజు ఉదయానికే ‘నో స్టాక్‌’ బోర్డులు ప్రత్యక్షమై జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్రోల్, డీజిల్‌ దొరక్క వేలాది ట్రావెల్‌ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపై నిలిచాయి. అనేకచోట్ల ట్రాఫిక్‌ స్తంభించిందని సమాచారం. వందలాదిమంది పిల్లలు, వృద్ధులు ఎటూపోలేక మండుటెండల్లో మలమలమాడారు. ఇప్పటికీ మారిందేమీ లేదు. ఇంత జరిగినా ఇదేమిటని ఆరా తీసే నాథుడు కరువయ్యాడు. 

కొందరు మంత్రులు పాలనలో పాఠాలు నేర్చుకొస్తామని దేశాలు పట్టిపోయారు. ముఖ్యమంత్రి అగమేఘాలపై మరో రాష్ట్రానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పక్క రాష్ట్రంలో అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ వ్యక్తిగత విషాదంలో ఉన్నారు. మామూలు సమయాల్లో సర్వజ్ఞ సింగభూపాలుడి మాదిరి సకల శాఖల్లోనూ పెత్తనం చేసే ‘రెడ్‌బుక్‌’ మంత్రి లోకేశ్‌ మాత్రం ఆచూకీ లేకుండాపోయారు! రాష్ట్రంలో సంస్కరణల సంగతలావుంచి, పాలన ఎంత ముదనష్టంగా మారిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా! సామాజిక మాధ్యమాలు తిరగేస్తే, చానెళ్లు వీక్షిస్తే ఈ అరాచకాన్ని అరక్షణంలో ‘స్వయంగా’ తెలుసుకునే సౌలభ్యం ఉండగా... ఎంత తెలివితక్కువవారైనా అందుకోసం పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వదుల్చుకునే సాహసం చేస్తారా?

అధికారంలోకి రావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా అరాచకానికి తెరలేపి, ఇప్పటికీ దాన్ని వదలకుండా కొనసాగిస్తున్న ఘనులకు ఇంధన కొరతపై కనీస జ్ఞానం కరువైందంటే దిగ్భ్రాంతికరం. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం అధికారులతో చర్చించారనీ, మూడు రోజుల ముందే సమస్య వచ్చిపడుతోందని తెలిసినా పట్టించుకోలేదేమని ప్రశ్నించారనీ మీడియాలో కథనాలు ప్రత్యక్షమయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఏం జరుగుతున్నదో స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పుకునే సీఎంకు ఇలా ప్రశ్నించటానికి సిగ్గుండాలి. వారు విఫలమయ్యారు సరే... కానీ తనలోని ‘హైటెక్‌ నిపుణుడు’ ఏమైనట్టు? పోనీ ఈ సమీక్ష తర్వాతైనా పరిస్థితి మారిందా? లేదే!

సమస్య మూలాలపై సీఎం మొదలుకొని ఎవరికీ సరైన అవగాహన లేదని వారి మాటలు చూస్తే అర్థమవుతుంది. మూడు రోజుల కిందటే సమస్య ఉందని బాబు అంటే... రాష్ట్రంలో కావలసినంత స్టాక్‌ ఉందని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు! కేవలం వదంతులవల్ల జనం ఒక్కసారిగా రావటంతో ‘సరఫరా లోపం’ ఏర్పడిందని కొట్టిపారేస్తున్నారు. ఎవర్ని నమ్మాలి? వీరి అయోమయం కారణంగా సాధారణ జనం మాత్రమే కాదు... రైతులు సైతం అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం, రవాణా, ఆక్వా రంగాలు కూడా డీజిల్‌ లభించక గుడ్లు తేలేస్తున్నాయి. కోల్డ్‌ స్టోరేజిలు సరేసరి. ఉత్పత్తులు నాశనమై, రైతులు నష్టపోతే ఈ పాలకులకు వారిని ఆదుకునేపాటి ఉదారతైనా ఉండదు. 

నిజానికి ఏపీ మెరుగైన స్థితిలో ఉండాలి. కర్ణాటకలోని పాదూరు, మంగళూర్‌లతో పాటు విశాఖలో కూడా వ్యూహాత్మక చమురు నిల్వలుంటాయి. విశాఖకు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయంగా సమస్యలొచ్చినా ఈ నిల్వలవల్ల పదిరోజులపాటు దేశం నిశ్చింతగా ఉండొచ్చంటారు. ఇక విశాఖ చమురు శుద్ధి కర్మాగారానికి రోజుకు 3 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉంది. అంటే ఏడాదికి కోటీ 50 లక్షల మెట్రిక్‌ టన్నులు. పైగా మాది ‘డబుల్‌ ఇంజన్‌ సర్కార’ని చెప్పుకుంటారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వీరి దయాదాక్షిణ్యాలపైనే సాగుతోంది. మరి ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఏపీకే ఎందుకొచ్చినట్టు? పాలన మరిచి అరాచకాన్నే నమ్ముకుంటే, స్వోత్కర్షలకూ, స్తోత్రపాఠాలకూ అలవాటుపడితే జరిగేది ఇదే. ఈ బాపతు పాలకుల్ని ఏం చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో జనం గ్రహిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement