అందెల రవమిది పదములదె! | - | Sakshi
Sakshi News home page

అందెల రవమిది పదములదె!

Jun 13 2026 7:20 AM | Updated on Jun 13 2026 7:20 AM

నేత్ర పర్వంగా సాగిన నృత్యాభినయం

అన్నమయ్య కీర్తనలకు

175 మంది నృత్య నీరాజనం

గోదారి తీరం.. ఆనంద తాండవం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముదా అంటూ అంతర్జాతీయ సంగీత కళా సమ్మేళన్‌ ఫెస్ట్‌ 2026 రెండో రోజు హృద్యంగా సాగింది. ఒక్కటి కాదు రెండు కాదు 108 అన్నమయ్య పద సంకీర్తనల ఝురిలో గోదారి తీరం తడిసి ముద్దయ్యింది. భక్తి, శృంగార, కరుణ రసాలలో ఆయన రచించిన కీర్తనలకు రసరమ్యంగా నృత్యం చేశారు. 175 మంది ప్రదర్శించిన నృత్యాభినయం నేత్రపర్వంగా సాగింది. 44వ అంతర్జాతీయ సమ్మేళనంలో భాగంగా రాజమహేంద్రవరం రివర్‌బే వద్ద గల ఆహ్వానం ఫంక్షన్‌ హాల్‌లో సాగిన ఈ కార్యక్రమంలో వీక్షకులు తన్మయులయ్యారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోంది. తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి జరిగే తిరుప్పావడ సేవ (పులిహోర) సేవను అక్కడ జరిగినట్టే ఇక్కడా నిర్వహించారు. పులిహోర, వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో స్వామి వారి ప్రతిమను చేసి సేవ అనంతరం వీక్షకులకు ప్రసాదంగా వితరణ చేశారు.

9 గంటల 9 నిమషాల

9 సెకండ్ల పాటు నృత్యాభినయం..

శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.6 గంటల వరకు 175 మంది నృత్యకారులు పదకవితా పితామహుడు కలియుగ దైవం వేంకటేశ్వరునిపై రచించిన కీర్తనలకు నృత్యం చేశారు. చిన్నారులు సైతం నర్తించి వేదికకు శోభ తెచ్చారు. అనంతరం రాత్రి వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వహకుడు, హిందు ధర్మ పరిషత్‌ ట్రస్టు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జీబీ నారాయణ మాట్లాడుతూ నేటి తరం సంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు తిరిగి పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement