రంజాన్ స్పెషల్ స్టోరీ : నాకు కావలసినదల్లా అక్కడుండేది..

Ramadan 2023 special story - Sakshi

అప్పుడు పంతొమ్మిదివందల ఎనభై రోజులు. అపుడు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు కానీ పండగలు మాత్రం ఖచ్చితంగా ఉండేవి. మా ఇళ్లల్లో జరుపుకునే పండగలు కొన్నయితే, బయట కనపడేవీ మరికొన్ని. మా ఇంటికి ఆనుకునే కమ్యూనిస్ట్ మార్కిస్ట్ పార్టీ ఆఫీస్ ఉండేది. వీలు కుదిరినపుడల్లా నేనస్తమానం అక్కడే ఉండేవాణ్ణి. నాకెప్పుడు చూసినా వీలు కుదిరేది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లో నాకెంతో ఇష్టంగా అనిపించే పుస్తకాలు ఉండేవి, తెలుగులో వచ్చే అన్ని దినపత్రికలు అక్కడ దొరికేవి. సాయంకాలాలు కామ్రేడ్స్ మీటింగులు ఉండేవి. ప్రతి సమావేశం ప్రారంభంలోనూ, ముగింపులోనూ పాటలు ఉండేవి. వారితో కలిసి గొంతు కలపడానికి ఎంతో ఉత్సాహంగా ఉండేది. కలుపుతుంటే సంతోషంగా ఉండేది. 

మధ్యాహ్నాలు పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉండేది. అక్కడ నీలిమందు రంగు, రెడ్ ఆక్సైడ్ కలిపిన జగ్గులు ఉండేవి, కుంచెలు ఉండేవి, తెల్లని గోడలు ఉండేవి. నేనక్కడే గోడల మీద బొమ్మలు వేసుకుంటూ ఉండేవాణ్ణి. నిద్ర తగిలినపుడు చల్లని ఫ్యాన్ కింద విశాలాంధ్రో, ప్రజాశక్తో, ఆంధ్రప్రభో పేపరు పరుచుకుని నిదుర తీసే కాలం ఉండేది. తరుచుగా సామాజిక స్పృహ కలిగిన సాంఘిక నాటకాల, బుర్ర కథల, విప్లవ గీతాల రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. నేనన్నిటికీ హాజరయ్యేవాణ్ణి, నాటకాల డైలాగులు, బుర్రకథల భళానంటి భాయి తమ్ముడా మేల్ భళానోయ్ తందానాలన్నీ నాలుక చివర పాఠాల్లా అతుక్కుపోయేవి. మా నూనెపల్లె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ మనుష్యుల్లో గొప్ప గుణం ఏమిటంటే చిన్న పిల్లవాడినని, ఏమీ తెలియనివాడిని కదాని నన్నెప్పుడూ దూరం పెట్టేవారు కాదు.

నాకు కావలసినదల్లా అక్కడుండేది, నాకు ఆ వాతావరణం నచ్చేది. వారు నాకు అయినవారు అయ్యారు. వారు దేవుడు లేడనేవారు. నేనూ దేవుడు లేడనే అనుకునేవాణ్ణి. లేడని ఎవరితో అనేవాణ్ణి కాదు. దేవుడు ఎవరికి ఉన్నా లేకున్నా టంచనుగా మాత్రం పండగలు వస్తూ ఉండేవి. మేము జరుపుకునే ముస్లిమ్ పండగలు, మేము జరుపుకోకున్నా ఇరుగూ పొరుగులతో జరుపుకున్నంత జరిగే ఇతర పండగలు. అతి ముఖ్యంగా ఆగష్ట్ పదహైదు, జనవరి ఇరవై ఆరు, అక్టోబర్ రెండు, నవంబర్ పద్నాలుగు… మొదలైన జాతీయపండగలు కూడా అంతే ఉత్సాహంగా జరుపుకోడానికి నిద్రలేచేవాళ్లం. 

అసలు పండగలంటేనే తెల్లవారు ఝామునుండే మొదలయేవి. ఇంటి బయట పెద్ద డేగిసా పెట్టి కట్టెల పొయ్యి మీద నీళ్ళు నిరంతరాయంగా కాగుతూనే ఉంటాయి, కాగిన నీళ్ళు కాగినట్లుగా పట్టుకుపోయి జాలాట్లో గంగాళంలో పోస్తూనే ఉంటారు. జనాలు స్నానాలు చేస్తూనే ఉంటారు. మొదట ఇంట్లో ఉన్న మగవాళ్ళు, పిల్లలు స్నానాలు కానిస్తారు, నమాజులకు వెళ్లాలి కదా. గంగాళంలో ఆ ఉడుకుడుకు నీటిలో ఇత్తడి చెంబు ముంచుకుని స్నానం చేయ్యడమనే అనుభవాన్ని ఆ గోల్డన్ ఓకర్ ఎల్లో రంగుని తలుచుకుంటుంటే గతజన్మ జ్ఞాపకాల్లా అనిపిస్తున్నాయి అవన్నీ.

స్నానాలు కాగానే కొత్త బట్టలు తొడుక్కోవాలి కదా! మా మేనత్త భర్త మా కుటుంబానికి ఆస్థాన దర్జి, కాబట్టి మాకెప్పుడూ సమయానికి కొత్త బట్టలు కుట్టి రెడీగాలేవు అనే చింతే రాసిపెట్టి లేదు. ఆ రోజుల్లో పండగలకు కొత్త బట్టల ముచ్చట ఏమో కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కొత్త బట్టలకు పండగా, పుణ్యకార్యాల ప్రాప్తత లేదు. జనం దగ్గర డబ్బులు, అప్పులు ఎక్కువయిపోయి ఎప్పుడు పడితే అప్పుడు అవసరమున్నా, లేకున్నా బట్టలు కొనేయడం, వేసేసుకోడమే. అసలు కొత్త బట్టలంటేనే తాను నుండి గుడ్డ చింపించి, చక్కగా కొలతలు తీపించి, కుట్టించి, నలభైసార్లు దర్జీ షాపు చుట్టూ తిరిగి, చొక్కాయ్ సాధించి దానిని బొగ్గుల పెట్టెతో ఉల్టా పల్టా ఇస్త్రీ లాగించి మన చొక్కాని తొలిసారిగా వాడెవడో కాక మనమే తొడుక్కోడం. ఇప్పుడు మనం కొత్తంగి అని తొడుక్కునేది ఎక్కడని కొత్తది? ఆ రెడీమేడ్ షో రూమ్ ట్రైల్ రూమ్‌లో ఎంతమంది దానిని వేసుకుని, విడిచి, నలగ్గొట్టి బాలేదని బయట పడేసింది వచ్చి మన వాటాకు దక్కిందో!

ఇట్లా వచ్చే పండగలకు, మన పుట్టిన రోజు పండగలకు ఆ దగ్గరికాలం రోజుల్లో మన స్కూల్ యూనిఫామ్ కనుక చినగడమో, పొట్టి కావడమో జరగరాదని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడికి దండం పెట్టుకోవాలి. లేకపోతే దుబారా అవుతుందని ఒక్కోసారి పండగలకు, పుట్టినరోజులకు మనకు స్కూలు డ్రస్సును కొత్తబట్టలుగా కుట్టించడం పెద్దల జాగ్రత్త. పండగనాడు కూడా బడి యూనిఫామ్ ఏమిరా! పైన తెలుపు, కింద ఖాకీ. ఏవయినా రంగులా అవి?

స్నానాలు కానించి, కొత్త బట్టలు వేసుకుని, తలకు నూనె పట్టించి, సుబ్బరంగా తల దువ్వుకుని, రెడీ రెడీ అనుకున్నాకా పెద్దలూ పిల్లలూ అందరూ తిక్కస్వామి దర్గా దగ్గర ఈద్గాకు బయలుదేరేవాళ్లం. చక్కగా మడత పెట్టిన దుప్పట్లను మేము పెద్ద పిల్లలం చంకలో పెట్టుకుంటే, మాకంటే చిన్నవాళ్లయిన మా బుల్లి బుల్లి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మా చిన్నాయనగార్లవో, మావో చిటికెనవేళ్ళు పట్టుకుని దారికంతా అత్తరు వాసన అద్దిస్తూ నడిచేవాళ్లం. మామూలుగా ఏ రోజు కూడా అయిదుపైసాలు కూడా పిల్లల చేతిలో పెట్టని మా మాబ్బాషా చిన్నాయన రోజు మా చేతికి, మా జేబుకు నిండుగా రూపాయలు, అర్ధరూపాయల బిళ్లలు నింపేవాడు (అంటే మా చిన్నాయన మూడువందల అరవైనాలుగు రోజుల పిసినారి అని కాదు, డబ్బు పిల్లలను చెడగొడుతుంది అని ఆయన నియమం, అదే అవసరమైన ఖర్చుపెట్టే దగ్గర ఆయనది ధారాళమైన చేయే) ఆ చిల్లర డబ్బులంతా ఎందుకంటే నమాజు ముగిశాకా దారికి రెండు పక్కలా బీదా బిక్కీ జనం ఉంటారు కదా, వారికి ధర్మం చేయడానికి. ఒక్క నాణెం మిగిలిపోకుండా అన్ని బిళ్ళలు అక్కడే పంచి వచ్చేసేవాళ్ళం. అలా నమాజు నడకకు బయలుదేరితే దారి నిండా నమాజులకు వెళ్ళే జనమే.

 మామూలు రోజుల్లో నిత్యం లుంగీ, కట్ బనీయన్‌ల మీద కనపడే టీ బంకు లాలూభయ్ గాని, రిక్షా తొక్కే బాషా భయ్ వంటి అనేకం ఆరోజు అమిత శుభ్రంగా, కళకళ్లాడుతూ ముచ్చటగా కొత్తబట్టల్లో కొత్తగా కనపడేవారు. ఈద్గా దగ్గర నా స్కూలు ప్రెండ్స్ కూడా చాలామంది కనపడేవారు. వాడు కనపడగానే వీడు, వీడు అగుపడగానే వాడు పళ్ళికిలించుకోడమే తప్పా, ఆదాబ్ అనో, అస్సలామలైకుం అంటూ లేని గడ్డాన్ని నిమురుకుంటూ గంభీరంగా తెలుగు సినిమా వేషాలు ఏమీ పడేవాళ్లం కాదు. మాకు తెలిసిన అస్సలామలైకుం అల్లా ‘సలాములేకుం సాయబుగారు భలే జోరుగా ఉన్నారు’ అనే గులేబకావళి సినిమా పాట మాత్రమే. ఎక్కువ ఆలస్యం చేయకుండా పండగ నమాజు చేసే ఈద్గాకు త్వరగా చేరుకుంటే స్థలం కోసం అటూ ఇటూ వెదుక్కోకుండా మా దుప్పట్లు పరుచుకునేంత చల్లని నీడని ఏ చెట్టుకిందో చూసుకోవచ్చు.

ప్రార్థనలు త్వరగానే ముగిసేవి. ప్రార్థానానంతర ఉపన్యాసాలు ఉంటాయి కదా, అవి చాలా సమయం తీసుకుంటాయి. అప్పటికీ ఎండ చురుకెక్కుతుంది. ఉదయం ఏమీ తినకుండానే వస్తాము కదా, పిల్లలు బెట్ట పోతారని మా చిన్నాయన దిగులు. అందుకే మంచి చెట్టుకింద జాగాలో మా దుప్పట్లు పరుచుకుంటాం. కాసేపటి తరువాత నమాజు మొదలవుతుంది. కుడివాడు కుడికి తల తిప్పితే కుడికి, ఎడమవాడు ఎడమకు తిప్పితే ఎడమ. ఎదుటివాడు ముందుకు వంగితే మనమూ వంగడమే తప్పా దేనినీ శాస్త్రోక్తంగా నేర్చుకున్నది లేదు. చిన్నపుడు పర్లేదు కానీ కాస్త పెద్దయ్యాక మనం చేసేది దొంగ నమాజు. కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసే తోటివాళ్ళు చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు కదా! మన మనసు గమనిస్తుంటుంది కదా! సిగ్గుగా ఉండదూ? మనమీద మనకు అసహ్యం వేయదూ? అందుకని ఆ దొంగ పని ఎందుకని అదీనూ మానేశా.

 (ఆ తరువాత్తరువాత  ఈద్గాలో సామూహిక ప్రార్థన వదిలేసి మునిసిపల్ హైస్కూలు గ్రవుండ్లో చాచిన చేతులు అల్లా దువా కోసం కాక ఎర్రని కార్కు బంతిని పట్టడం కోసం విచ్చుకునేవి. మధ్యాహ్నం నమాజులు ముగిసే సమయానికి పది ఓవర్ల మ్యాచు ముగిసి రంజాను నమాజు జనాల గుంపు మధ్య కాళ్ళు దూర్చి ఇల్లు చేరుకునేవాడ్ని. మాసిన బట్టలు, చెరిగిన తల, దోక్కుపోయిన మోచేయి అందాక చేసిన ఘనకార్యం చెబుతున్నా నాయనమ్మ, మేనత్తలు, పిన్నులు ఏమీ అనేవారు కాదు. వేడి పాల సేమియాలో నానిన కిస్మిస్‌లకు మాదిరి మెత్తని నవ్వుతో తియ్యగా కనిపించేవారు.)

నమాజు ముగిశాకా ఈద్గా దగ్గరి నుండి ఇంటికి చేరే వరకు దారిన తగిలిన ప్రతి ఒకరిని మా పెద్దవాళ్ళు ఆలింగనాలు చేసుకుంటూ వచ్చేవారు. ఏమిటీ నడిరోడ్డు మీద కావిలింతల ఆలస్యం అని విసుక్కుంటూ పిల్లలం మేము మాత్రం గబగబా పరిగెత్తుకు ఇంటికి వెళిపోయేవాళ్లం. వచ్చాం కదాని సరాసరి ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. గుమ్మం దగ్గర మా పిన్నిగార్లల్లో ఎవరో ఒకరు పళ్ళెంలో ఎర్ర నీళ్ళు పట్టుకు నిలబడితే అందులో అయిదు పైసాలో, పది పపైసాలో బిళ్ళ పడేసేవాళ్లం. పిలల్ల తల చుట్టూ ఆ పళ్ళెం తిప్పి దిష్టి తీసేసేవారు. అప్పుడు కాళ్ళు మొహం శుభ్రంగా కడుక్కుని ఇంటి లోపలికి వస్తే చక్కగా కూచోబెట్టి నోటి నిండా తీపిగ సేమియా పాయసం తినపెట్టేవారు. 

ఈ హైద్రాబాద్ మహానగరానికి వచ్చాకా పత్రికల భాషలాగా పండగ వంటకాలు కూడా మారిపొయినై! క్యా భాయ్! షీర్ కూర్మా నహీ హైక్యా? హలీం నహి ఖిలాతే? ఇఫ్తార్ విందు ఎప్పుడు ఇస్తాయి హై? వంటి విపరీత ఓవరాక్షన్ మాటలు వినపడేవి. అసలు రంజాన్‌ను రంజాన్ అని కూడా అనకూడదట రమ దాన్ అనాలని మళ్ళీ అదొక రుద్దుడు జ్ణానము. వద్దురా దేవుడా! ప్రాంతం ప్రాంతంకి కల్చర్, ఆహార విహారాలు, ఆచార వ్యవహారాలు మారిపోతాయిరా స్వామి. మాకసలు పత్రికా పదకోశ పాకముల వంటి బిరియాని, మిర్చ్ కా సాలన్, షీర్ ఖూర్మా, హలీం, హరీస్ లేనే లేవు. మాదంతా నంద్యాల జిల్లా, నూనెపల్లె ఆత్మకింపుగా వండబడిన సేమియా పాయసం, డబల్ కా మీఠా, బగరా ఖానా, దాల్చా, భాజి బోటి, పెరుగు పచ్చడి. అంతే! చాలు! ఇదే మా పండగల జీవితాదర్శం.

ఆ విధంగా పండగ పాయసం మీద వేసిన మేవా మెక్కేసి పాయసం లోపల ఉన్న కిస్మిస్, గోడంబి పలుకులు తినేసి, మెత్తని పాయసం తీగల్ని జుర్రేసేలోగా మా చిన్నాయనలు, మా మేనత్తల భర్తలు వచ్చేసేవాళ్ళు. ఇంటి లోపల అందరికీ చక్కగా పొడగాటి సిరి చాపలు, బొంతలు పరిస్తే ఇంటిల్లపాది కూచుని హాయిగా అన్నాలు తినేవాళ్లం. నాకైతే రంజాన్ నాడు వండే పలావు కన్నా మహత్తరమయిన రుచిగల మరో పండగ పలావు ఉండేది. అది పెద్దలపండగ అని వస్తుంది ఆ రోజున వండే పలావుకు రుచే ప్రత్యేకం. అది ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్దల రాత్రి అని ఒక దినం ఉంటుంది. 

ఆ దినాన మా ఇంట్లో మరణించిన వారినందరిని గుర్తు చేస్తుకుంటూ, వారు తమ జీవితకాలంలో దేన్నయితే ఇష్టపడేవాళ్ళో ఆ పదార్దాలను నైవేద్యంగా పెట్టేవారు. వారి కొరకు కొత్తబట్టలు తెచ్చేవారు. మా జేజినాయనకు గణేష్ బీడి ఇష్టమని బీడి కట్ట ఒకటి, గళ్ళుగళ్ళు గల లుంగి, మా అమ్మకు చీర, చిన్నతనానే చనిపోయిన చిన్నపిల్లల కోసం లడ్డు, బాదుషా, మినపగారెలు, ఇంకా అవీలు ఇవీలు. ఎవరికి ఏది ఇష్టమేదయితే అది అన్నమాట. సాయంత్రం కాగానే మౌలానాగారు వచ్చి ఫాతెహ్ జరిపిన తరువాత ఇంట్లో ఉన్న చిన్నా పెద్దా అందరూ శుభ్రంగా స్నానాలు కానించి, ఈ కొత్త బట్టలు, నైవేద్యాలు దేవుని గూడు ముందు పెడతాం కదా అక్కడకు చేరి, ఆడవాళ్ళు అయితే నెత్తిన కొంగు కప్పుకుంటారు, పిల్లల నెత్తి మీద ఒక టవల్ వేసి, ఉత్త మోకాళ్ళు కనపడకుండా ప్యాంటో, తువ్వాలో, లుంగీనో కట్టపెట్టి, ఇంట్లో చనిపోయిన వారి పేరుపేరిట జేజినాయనకని, అమ్మకని, చిన్నమ్మకని, చిన్న చిన్నాయనకని వారిని తలుచుకుంటూ నిప్పుల్లో సాంబ్రాణి ధూపం వేయిస్తారు. నేను ఈ హైద్రాబాదు నగరానికి వలస వచ్చిన తరువాత కూడా గత రెండు సంవత్సరాల క్రితం వరకు మా మేనత్త మాబున్ని అమ్మ ప్రతి సంవత్సరం మాకు పెద్దల పండగ రాబోతుందని గుర్తు చేసేది. మా ఆవిడ లావణ్య ఇంట్లో పెద్దలకని బట్టలు కొని తెచ్చేది. 

సాయంకాలం కమ్మగా ఇంత పలావు, మాంసం కూర, పాయసం వండి పెడితే – మాకు ఆ కల్మాలు, సూరాలు తెలీవుగా! అయినా బుర్ర తక్కువయినా, మనసు నిండుతో వారందరి పేర్లను తలుచుకుంటూ సాంబ్రాణి పొగను, మా భక్తితో పాటే ఆకాశం వైపు పంపించేవాళ్ళం. వారందరితో పాటు ఆమధ్యే మాకు దూరమయిన బాపుగారు, పతంజలిగారు, నాయుని కృష్ణమూర్తిగారు, మోహన్‌గారికి కూడా సాంబ్రాణి భక్తిని వేసేవాళ్ళం. మా మేనత్త ఆ మధ్యే పోయారు. ఆవిడతో పాటే ఈ పండగల మంచీ చెడూనూ. సంవత్సరం సంవత్సరం మాతో ఈ పనులు చేయించిన మా మేనత్తకే మా సాంబ్రాణి తాకే ప్రాప్తం లేకపోవడం పెద్ద దుఃఖం.

పెద్దలందరి పేరిట సాంబ్రాణి ధూపాలు వేసిని తరువాత ఇంటిల్లిపాది అంతా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి కాసేపు బయట కూచోవాలి. అప్పుడు మా పెద్దలు అందరూ దివినుండి దిగి వచ్చి మేము తెచ్చిపెట్టిన బట్టలు ఇష్టంగా కట్టుకుని, వండిన అన్నాలు తిని వెళ్ళిపోతారని చెప్పేవారు. అవన్నీ మనం చూడకూడదని అందుకే తలుపులు మూయాలని చెప్పెవారు. ఇట్లాంటి మాటలు అన్నీ భలే ఉండేవి. అదే చిన్నతనాన అప్పుడప్పుడూ మా ఇంట్లోకి ఝుమ్మంటూ కందిరీగ వచ్చేది. దాన్ని చూసి ఎక్కడ కుడుతుందోని భయంతో దూరం తోలడానికి విసనకర్రో, చేటో పుచ్చుకుంటామా, దానిని కొట్టవద్దని, పాపమని మా మేనత్త చేప్పేది. అది కందిరీగ కాదట. చనిపోయిన మా జేజినాయన అలా వచ్చాడని చెప్పింది. ఆ మాటను ఇప్పటికీ అలాగే పుచ్చేసుకున్నా. ఈ రోజుకు మా ఇంటి బాల్కనీలో మొక్కల మీదికి ఒక కందిరీగ వస్తుంది, దానికేసి అలానే గమ్మున చూస్తాను. మా పిల్లవాడు వచ్చి అరే! జేజినాయన వచ్చినాడే! అంటాడు. జీవితంలో చాలావాటికి హేతువులు, సమాధానాలు, తెలివితేటలు వాడనక్కరలేదు. కొన్ని విషయాలపై ప్రేమ కలిగి ఉంటే చాలు. చాలా బావుంటుంది. మీరూ ఎప్పుడయినా వాడి చూడవచ్చు.

పెద్దల పండగనాడు మూసిన తలుపుల వెనుక మూయని పళ్ళాల మీది పలావు అన్నం, కూర గిన్నె, దాల్చా పాత్రల్లోకి ఇల్లంతా నిండిన సాంబ్రాణి పొగ కాస్త తగిలి కాస్త, కాస్త ములిగి, కాస్త అల్లుకుని ఆ పదార్థాలన్నీ రుచి అవుతాయి చూడండి, అబ్బా అంత రుచయిన తిండి నా వరకు మళ్ళీ ఏ పండగలోనూ తగలదు! అందుకని నాకు రంజాను అంటే తిండి కన్నా పెద్దలామాశ పండగ తిండే గొప్ప. చిన్నతనాన పిల్లల ప్రాణానికి రంజాను అంటే తిండి పండగ కాదు. ఈనాము డబ్బుల పండగ. మాది అప్పట్లో ఉమ్మడి కుటుంబం. మా జేజెమ్మా-జేజినాయనల మగ సంతానం అంతా ఒకే చోట, ఒకే ఇంట్లో ఉండేవారు. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయి బయటికి కాపురానికి వెడతారు కదా.

 నమాజు ముగిశాకా మా మేనత్తలు, మామలు, వాళ్ల పిల్లలూ అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చేవారు. పెద్దవాళ్ళు ఈద్ ముబారక్ ఆలింగనాలూ చేసుకుంటే మా వంటి పిల్లలం వంగి పెద్దల కాళ్లకు దండాలు పెట్టుకుని, లేచి ఈనాము డబ్బులు అడిగేవాళ్ళం. ఈనాము కదా డబ్బులు అంటే, సంపద అంటే, ఆస్తి అంటే. వసూలయిన డబ్బుని వచ్చింది వచ్చినట్లుగా ప్రతిసారీ గలగలమని లెక్కలు పెట్టుకుంటుంటే ఎంత బావుండేది! అటూ ఇటూ నడుస్తూ, పరిగెడుతూ, నిక్కర్ జేబులో నాణేల బరువు, ఘల్లు ఘల్లు చప్పుడు అవుతుంటే అచ్చం లక్ష్మీదేవి మా చిల్లర జేబుల్లో కొలువు తీరినట్లుగా ఉండేది. రావాలసిన వాళ్ళు అంతా వచ్చేశారు, ఇవ్వవలసినది ఇచ్చేశారు, ఇక రాలేదేం లేదు అనుకున్నాకా అన్నాదమ్ములం, బావా మరుదులం అంతా సినిమాకని టవున్ దారి పట్టేవాళ్లం. మొదటి ఆట అయిపోయేసరికి రంజాను పండగ ముగిసేది.

వయసు పెరిగేకొద్ది పండగ కూడా ముసలిదవుతుందని తెలీదు, విషయం తెలిసిన పెద్దలు ఎవరూ మాకు చెప్పలేదు. కరిగిపోతుందని తెలుసు కాబట్టి పుల్ల ఐసుని కొంచెం కొంచెం కొరుక్కుతిన్నట్టుగా పండగలని ఆ రంగులని నిముషానికి ఆరు లక్షల తొంబై మూడు వేల నాలుగువందల పదహారు సెకండ్ల చొప్పున అనుభవించాలని తెలీదు. అన్నిటికీ తొందరే! ఎప్పుడెప్పుడు సాయంత్రమవుతుందని ఉదయం, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందాని సొమవారం, ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దయిపోయి జిప్పున్న ప్యాంట్ తొడుక్కుంటామని త్వరపడిపోయి బాల్యాన్ని విడిచేశాం. 

మా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ దేవుడు లేడని నాకు చెప్పింది కానీ పండగలు మాత్రం ఉన్నాయని నా చిన్ననాటి ఇల్లు నేర్పింది నాకు. ఇపుడు పెరిగి పెద్దయ్యినాకా ఆఫీసు నుండి ఉదయపు వయసు అలసటతో ఇంటికి వచ్చి సాయంకాలం దీపం వంక చూస్తే దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే. అని మనసుకు శాంతి అనిపిస్తే జనార్దనుడో, జీససుడో, అల్లా మాలికుడో ఎవరో ఒకరు మనకు ఆయన లేడు అని మనమనుకున్నా మీరంతా నాకు ఉన్నార్రా పిల్లలూ అని దేవుడు దీపంలా తలాడించినట్లు ఉంటుంది. దీపం దేవుడు రంజాను రోజున ఆకాశమెక్కుతుంది. నెలవంకగా మారుతుంది. నా బాల్యంలో ఆకాశంలో కనబడిన రంజాన్ నెలవంకను చూసి వెంటనే కళ్ళు మూసుకుని గోడలు తడుముకుంటూ గొంతెత్తి నా పేరు పిలుస్తూ నా కోసం వచ్చేది మా జేజి. తన చేతుల్లోకి నా మొహన్ని తీసుకుని అప్పుడు కళ్ళు తెరిచి నన్ను చూసేది. నెలవంక తరువాత నా గుండ్రని మొహం. అంతే! నా తరువాతే పండగ. 

చందమామను, ప్రేమని, పండగని ఎలా అహ్వానించాలో నేర్పిన మొదటి మనిషి మా జేజి, ఆ పై మా మేనత్తలు, పిన్నిగార్లు. ఇప్పుడు పండగ సంవత్సరానికి ఫలానా రోజు వచ్చే ఒక తారీఖు మాత్రమే. ఆ మనుషులూ వాళ్ళ జ్ణాపకాలు, ఆ గోరింట పండే రాత్రుళ్ళు, తెల్లని అరచేతిలో ఉదయించిన ఎర్రని సూరీడు, నెలవంక, నక్షత్రాలు ఆరిపోయాయి. ఇప్పుడు మావాళ్ళు వారు లేని ఊరు జీవితంలోకి ఏ కొత్త చందురుడు వెలగలేడని అర్థం అయ్యింది. జీవితంలోని అసలైన కొన్ని ఉదయాలు, మధ్యాహ్నాలు, సాయంత్ర రాత్రుళ్ళు, నక్షత్రాలు నశించాయి. ఇక అవి ఎప్పటికీ లేవు. ఇప్పుడు పండగ లేదు. భగవంతుడే ఉన్నాడు. ఆయన దయ వలన జ్ఞాపకాల్లో పండగ మిగిలి ఉంది.

అన్వర్, ఆర్టిస్టు, సాక్షి దినపత్రిక

Read latest Devotion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top