వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్‌ విషయాలు

What Are The Reasons For Extramarital Affairs - Sakshi

దొర్నిపాడుకు చెందిన ఓ మహిళను వైఎస్సార్‌ జిల్లా పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భర్త వేధింపులు తాళలేక పిల్లలతో వచ్చి పుట్టినింట్లో జీవనం సాగిస్తున్న ఆమె మరో వ్యక్తితో తప్పటడుగులు వేసింది. విషయం తెలిసి తల్లిదండ్రులు మందలించడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని వందేళ్ల జీవితానికి 25 ఏళ్లకే ముగింపు పలికింది. ఫలితంగా ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. 

ఇటీవల ఆళ్లగడ్డ పట్టణంలోని యేసునాథపురానికి చెందిన ఓ వివాహిత ప్రియు డి మోజులో పడి భర్తను హత్య చేసింది. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. 

కర్నూలు నగరం బంగారుపేటలో నివాసముంటున్న ఓ మహిళ తన భర్త మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కొంతకాలంగా మధనపడుతుండేది. భర్తలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి వేరే మహిళ మాయలో పడటం..తల్లి బలవన్మరణం చెందడంతో వారి ముగ్గురు పిల్లలూ అనాథలయ్యారు.  

ఇలాంటి ఘటనలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడూనీడగా ఉండాల్సిన భార్యాభర్తలు వివాహేతర సంబంధాలతో విడిపోతున్నారు. ఒక్కోసారి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తూ అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేసి వెళ్తున్నారు.

కృష్ణగిరి(కర్నూలు జిల్లా): క్షణికావేశంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వల్ల వారి జీవితాలు నాశనమవుతుండగా వారి పిల్లలు దిక్కులేని వారవుతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రాం.. సామాజిక మాధ్యమం ఏదైనా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి మరింత దగ్గర చేస్తున్నాయి. ఇవి ఒక్కోసారి కాపురాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీసి భార్యను కడతేర్చే భర్తలు, ప్రియుడి కోసం భర్తను బండరాళ్లతో మోదే భార్యలు ఎక్కువైపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు వివాహేతర సంబంధాలకు వారధిగా మారుతున్నాయని తాజాగా విడుదలైన సర్వే వెల్లడించింది.

వివాహేతర సంబంధాల కారణంగా దేశంలో ఏటా మూడు వేల మంది హత్యకు గురవుతున్నారు. కట్టుబాట్లను దాటిన ఇష్టాలు, బంధాలను బలి కోరే సంబంధాలు, నైతికం కాని స్నేహాలు జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. దారి తప్పుతున్న దంపతులు పిల్లల బతుకులను చేతులారా ధ్వంసం చేస్తున్నారు. వివాహేతర సంబంధాలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు. ఆదర్శ దాంపత్యాలు అడుగడుగునా కనిపిస్తున్నా.. ఎక్కడో ఓ చోట విషపు గుళికలా ఇలాంటి వివాహేతర సంబంధాలు తారస పడుతున్నాయి. ఒక్కసారి పట్టు తప్పితే ఆ తప్పులకు మూల్యంగా ప్రాణాలే పోతున్నాయి.

అనాథలవుతున్న పిల్లలు 
వివాహేతర సంబంధాలు భార్యాభర్తల గొడవలతో ముగిసిపోవు. వాటి ప్రభావం పిల్లలపై అధికంగా పడుతోంది. ఎదిగే వయసులో తల్లిదండ్రులు గొడవ పడటం చూసిన పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు ఆ కారణంతో జైలుకు వెళ్లడం వంటి ఘటనలతో చిన్నారుల బాల్యంపై మరక పడుతోంది. అది జీవితకాలం వెంటాడుతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా నవ్వుతూ బతకాల్సిన పిల్లలు ఇలా ఏడుస్తూ రోజులు లెక్కపెట్టాల్సి వస్తోంది.

వివాహేతర సంబంధాలకు కారణాలు 
సంపాదనే ధ్యేయంగా చూసుకుని సంసారాన్ని నిర్లక్ష్యం చేయడం 
దంపతుల మధ్య తరచూ పడే చిన్నపాటి గొడవలను పెద్దవి చేసుకోవడం 
భార్యాభర్తల విషయాల్లో కుటుంబ సభ్యుల మితిమీరిన జోక్యం 
బయటవారితో కేటాయించిన సమయం.. లైఫ్‌పార్టనర్‌తో గడపకపోవడం 
పెచ్చుమీరిన ఆన్‌లైన్‌ స్నేహాలు 
చెడు వ్యసనాలకు బానిస కావడం 
బలహీన మనస్తత్వాలు 

తప్పనిసరిగా పాటించాల్సినవి 
దాంపత్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలి 
బకరినొకరు అర్థం చేసుకోవాలి.. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి 
ఆకర్షణలు తాత్కాలికమే గానీ శాశ్వతం కావనే నిజాన్ని గ్రహించాలి 
నైతిక విలువలు, సంబంధాలు, కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలి 
దాంపత్య జీవితంలో భాగస్వామికి అన్ని విషయాల్లో తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి

చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగిందంటే..  

చట్టం ద్వారా  పరిష్కరించుకోవాలి 
దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు చట్టం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలే తప్ప నేరాలకు పాల్పడకూడదు. కౌన్సెలింగ్‌ ద్వారా చాలామంది దంపతులు మళ్లీ ఒక్కటై సంతోషంగా ఉంటున్నారు. ఆకర్షణలకు లోనై జీవితాలను నాశనం చేసుకోకూడదు.
– కల్లా మహేశ్వరరెడ్డి, డోన్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు

పిల్లలపై ఎక్కువ ప్రభావం 
వివాహేతర సంబంధాల వల్ల కలిగే దుష్ఫరిణామాలు పిల్లలపైనే ఎక్కువ ప్రభావితం చూపుతాయి. పెద్దలు చేస్తున్న తప్పిదాలను గమనిస్తూ చిన్నారులు మానసిక క్షోభకు గురవుతారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.  
– మహేశ్వరప్రసాద్, వైద్యాధికారి, కృష్ణగిరి  

 జీవితాలను నాశనం చేసుకోవద్దు 
మానవ సంబంధాల్లో అత్యంత ప్రమాదకరమైనది వివాహేతర సంబంధం. దీని వల్ల రెండు కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకునే ప్రమాదముంది. వ్యామోహం సరదాగా ప్రారంభమై చివరకు జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతాయి. మా వద్దకు వచ్చే భార్య, భర్తల తగాదాల్లో అధికశాతం ఇలాంటి కేసులే. ఇప్పటికే ఎంతో మందికి కౌన్సెలింగ్‌ చేసి జీవితాలను నిలబెట్టాం. 
– యుగంధర్, సీఐ, వెల్దుర్తి    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top