Crime Nandakumar: కేరళ మంత్రి మీద ‘అశ్లీల వీడియో’కు ప్రయత్నం.. అరెస్ట్‌

Kerala Crime Nanda Kumar Arrested Over Employee Harassment - Sakshi

కొచ్చి: కేరళలో సంచలనాలకు నెలవైన క్రైమ్‌ నందకుమార్‌.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సహ ఉద్యోగిణిని లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దుర్భాషలాడిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. అంతేకాదు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ పేరిట నకిలీ అశ్లీల వీడియోను తయారు చేయాలనుకున్న అతని ప్రయత్నం గుట్టు వీడిందిలా..  

కేరళలో క్రైమ్‌ మాగ్జైన్‌, యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా టీపీ నందకుమార్‌ ఎంత పాపులర్‌ అయ్యాడో.. వివాదాలతోనూ అంతే వార్తల్లోకి ఎక్కాడు. క్రైమ్‌ వార్తల మీద సంచలనాత్మక కథనాలతో పాటు ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం పేరిట ఇబ్బందికరమైన కంటెంట్‌ను ఇస్తుంటాడు. తాజాగా సహ ఉద్యోగిణిని వేధించిన కేసులో కొచ్చి పోలీసులు.. కాలూర్‌లో అతన్ని అరెస్ట్‌ చేశారు. 

క్రైమ్‌ మ్యాగ్జైన్‌ చీఫ్‌ ఎడిటర్‌ అయిన టీపీ నందకుమార్‌.. తన దగ్గర పనిచేసిన ఓ ఉద్యోగిణి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపి తనను నీలిచిత్రంలో నటించాలని ఒత్తిడి చేశాడని భాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి Veena Georgeలా ఉన్నావని, నీలిచిత్రంలో నటించమని, ఆ వీడియో ద్వారా మంత్రిని బద్నాం చేయొచ్చని నందకుమార్‌ ప్లాన్‌ వేసినట్లు ఆమె తెలిపింది. 

ఒకవేళ నీలిచిత్రంలో గనుక నటించకపోతే.. తనపై మార్ఫింగ్‌ కంటెంట్‌ చేసి ఇంటర్నెట్‌లో వదులుతానని బెదిరించాడని, అయినా ఒప్పుకోకపోవడంతో కులం పేరుతో దూషించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన దగ్గర మంత్రి నగ్న వీడియోలు ఉన్నాయంటూ నందకుమార్‌ గతంలోనే ఓ కథనం ప్రచురించాడు. ఈ నేపథ్యంలోనే తనపై అశ్లీల వీడియోలో నటించాలని బెదిరించాడని ఆమె మీడియాకు వివరించింది. ఇక బాధితురాలితో పాటు ప్రస్తుతం క్రైమ్‌ మ్యాగ్జైన్‌లో పని చేస్తున్న మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేయడం గమనార్హం. దీంతో నందకుమార్‌పై ఐపీసీలోని సెక్షన్‌లతో పాటు ఎస్సీఎస్టీ యాక్ట్‌, ఐటీ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు పోలీసులు.

ఇదిలా ఉంటే.. నందకుమార్‌, మంత్రి వీణా జార్జ్‌ను టార్గెట్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమె మీద ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో కొక్కనాడ్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. తాజా పరిణామంతో తీరుమార్చుకోని నందకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, అలాగే క్రైమ్‌ మ్యాగ్జైన్‌ను మూసేయాలంటూ పలువురు నెటిజన్స్‌ కోరుతుండడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top