● తాళాలు వేసిన పలు ఇళ్లలో చోరీలు ● సీసీటీవీ పుటేజీలో దొంగల సంచరిస్తున్న దృశ్యాలు
పలమనేరు: పట్టణంలో ముసుగుదొంగలు హల్‌చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రాత్రుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీ వల సాయినగర్‌లో భారీ చోరీకి పాల్పడ్డారు. తాజాగా గంటావూరులో విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ చేశారు. పలు ఇళ్ల వద్ద ఏర్పా టు చేసిస సీసీ టీవీ పుటేజీల్లో రాత్రిళ్లు ముసుగు దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు జనాన్ని మరింత కలవర పెడుతున్నాయి.
పగటిపూట రెక్కీ
బయటి ప్రాంతాలకు చెందిన ఈ దొంగల కుటుంబ సభ్యులు, మహిళలు పగలు పట్టణంలో యాచిస్తూ ఏ వీధిలో ఏ ఇంటికి తాళం వేసి ఉందో పక్కాగా నిర్ధారించుకుంటారు. వారు ఇచ్చే సమాచారంతో రాత్రుల్లో ముసుగులు ధరించిన దొంగలు ఆ ఇంటిలోకి చొరబదుతున్నారు. ఆ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలున్నా ఏమాత్రం భయపడకుండా తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దుండగులు జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. రాత్రిపూట గస్తీని మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.


