Petrol Price: రూ. 3 తగ్గింపు.. సర్కారు సంచలన నిర్ణయం!!

Tamil Nadu Government Reduce Petrol Price - Sakshi

చెన్నై: లీటరు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది పెట్రోలు. ఆగకుండా పెరుగుతున్న ధరతో ఫ్యూయల్‌ కోసం బంకు వెళ్లిన ప్రతీసారీ బడ్జెట్‌ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట ​పద్దు తయారీ సందర్భంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

లీటరుపై రూ. 3 తగ్గింపు
పెట్రోలు ధరలను తగ్గిస్తూ  తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదు.. సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

వ్యాట్‌లో కోత
దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటేసింది. పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌)లను విధిస్తున్నాయి. ఇలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ మార్క్‌ని క్రాస్‌ చేసింది. దీంతో సామాన్యులకు పెట్రోలు ధరల నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వ్యాట్‌ను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. 

వంద దిగువకు
ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో  పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే  డీజిల్‌ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై  కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top