కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ | Promotion Isn't Progress Hidden Indicator of Career Stagnation | Sakshi
Sakshi News home page

కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్

Apr 30 2026 11:10 AM | Updated on Apr 30 2026 11:20 AM

Promotion Isn't Progress Hidden Indicator of Career Stagnation

సాఫ్ట్‌వేర్ రంగం అంటేనే నిరంతర మార్పులకు వేదిక. ఇందులో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వకపోతే వెనుకబడిపోతామన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి కొనసాగుతూ మనం నిజంగా ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా? ప్రమోషన్ వచ్చే వరకు వేచి చూడాలా? లేక మనకు మనమే ఒక గీటురాయిని నిర్ణయించుకోవాలా? దీనిపై మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన సీనియర్ ఇంజినీర్ కున్ చెన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.

ప్రమోషన్ అనేది ‘లాగింగ్ ఇండికేటర్’

చాలామంది ఉద్యోగులు తమ ఎదుగుదలను ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లతో కొలుస్తారు. కానీ, కున్ చెన్ అభిప్రాయం ప్రకారం.. ప్రమోషన్ రాకపోవడం అనేది మీరు ఎదగడం లేదని చెప్పే, చాలా ఆలస్యంగా తెలిసే ఒక ‘లాగింగ్ ఇండికేటర్’ (వెనుకబడిన సూచిక) మాత్రమే. స్టీవ్ హుయిన్ నిర్వహించే ‘ఎ లైఫ్ ఇంజనీర్డ్’ పాడ్‌కాస్ట్‌లో చెన్ మాట్లాడుతూ కెరీర్ స్తబ్దతను గుర్తించడానికి ప్రమోషన్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆ ఒక్క ప్రశ్నతో కెరీర్ అంచనా!

తన కెరీర్ ప్రారంభం నుంచి కున్ చెన్ ‘గత నెలలో నేను చేయలేని పనిని, ఈ నెలలో కొత్తగా ఏం చేయగలుగుతున్నాను?’ అనే సరళమైన, అత్యంత శక్తివంతమైన ప్రశ్న తనకు తాను వేసుకునేవారట. ఈ ప్రశ్నకు వరుసగా కొన్ని నెలల పాటు సమాధానం దొరకకపోతే మీరు నేర్చుకునే ప్రక్రియ ఆగిపోయిందని అర్థం. మైక్రోసాఫ్ట్‌లో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన పని పునరావృతం అవుతోందని, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని ఈ పరీక్ష ద్వారానే ఆయన గ్రహించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.

రాజీనామానే మార్గమా?

నేర్చుకోవడం ఆగిపోయిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెన్ సూచిస్తున్నారు. కంపెనీని వీడకముందే కొన్ని అంతర్గత మార్గాలను అన్వేషించాలని ఆయన సలహా ఇచ్చారు. మేనేజర్లతో చర్చించి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. కంపెనీలోనే ఎక్కువ లెర్నింగ్ స్కోప్ ఉన్న మరో టీమ్‌కు బదిలీ అవ్వొచ్చన్నారు. చెన్ కూడా మైక్రోసాఫ్ట్ లో అంతర్గత మార్పును ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో వేగంగా ఎదుగుతున్న ‘ఫేస్‌బుక్’ (మెటా) వైపు వెళ్లడమే సరైనదని భావించారు. వేగవంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుందని ఆయన నమ్మినట్లు చెప్పారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ కాలంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నిరంతరం తమను తాము ప్రశ్నించుకోవాలని చెన్ హెచ్చరిస్తున్నారు. ప్రతి నెల మనలో కొత్త నైపుణ్యం తోడవ్వకపోతే ఈ వేగవంతమైన పరిశ్రమలో మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి, ప్రమోషన్ల కోసం ఎదురుచూడకుండా మీరు ఏమేరకు కొత్త అంశాలు నేర్చుకుంటున్నారో ప్రతి నెలా చెక్ చేసుకోండి!

ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement