జనరిక్స్‌పై మెడ్‌ప్లస్‌... మరింత ఫోకస్‌

MedPlus Launches Store Generics says ceo Gangadi Madhukar Reddy - Sakshi

సొంత బ్రాండ్‌ ఔషధాలపై 80 శాతం వరకు డిస్కౌంట్‌

6 నెలల్లో లక్షలాది కస్టమర్లకు దాదాపు రూ. 140 కోట్ల ఆదా

సంస్థ ఎండీ గంగాడి మధుకర్‌ రెడ్డి వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధాల రిటైల్‌ దిగ్గజం మెడ్‌ప్లస్‌ ‘స్టోర్‌ జనరిక్‌’ కాన్సెప్టుపై మరింతగా దృష్టి పెడుతోంది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఈ కాన్సెప్టును దేశీయంగా తాము తొలిసారి ప్రవేశపెట్టినట్లు మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సరీ్వసెస్‌ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్‌ రెడ్డి తెలిపారు. దీని కింద తమ స్టోర్స్‌లో నాణ్యమైన సొంత బ్రాండ్‌ ఔషధాలపై ఉత్పత్తిని బట్టి 50–80 శాతం మేర, సగటున 60 శాతం మేర డిస్కౌంటుకే విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే మార్కెటింగ్, డి్రస్టిబ్యూషన్‌ చానల్‌పరమైన వ్యయాల భారం తమకు ఉండని కారణంగా ఇది సాధ్యపడుతోందని మధుకర్‌ చెప్పారు. తొలుత హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ మోడల్‌ను క్రమంగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో ఏడు రాష్ట్రాల్లో 26.2 లక్షల మంది పైచిలుకు కస్టమర్లకు గడిచిన ఆరు నెలల్లో రూ. 139.7 కోట్ల మేర ఆదా అయిందని ఆయన వివరించారు. దేశీయంగా దాదాపు 800 పైగా ఔషధాలు ఉండగా .. 600 పైగా జనరిక్స్‌ను తాము అందిస్తున్నట్లు మధుకర్‌ చెప్పారు.

దిగ్గజ సంస్థలతో జట్టు ..
‘‘సాధారణంగా జనరిక్స్‌ అంటే అంత నాణ్యమైనవి కాకపోవచ్చనే అపోహ ఉంటోంది. అయితే, బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్‌ అనే తేడా లేకుండా పేటెంటు ముగిసిపోయిన ఔషధాన్ని ఎవరు తయారు చేసినా అది జనరిక్‌ ఔషధమే. కాకపోతే ఎంత నాణ్యతతో తయారు చేస్తున్నారనేది ముఖ్యం. మా వరకు మేము నాణ్యతకు పెద్దపీట వేస్తూ అకుమ్స్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మా, విండ్‌లాస్‌ బయోటెక్‌ వంటి దేశీయంగా అగ్రగామి ఔషధ తయారీ సంస్థ (సీడీఎంవో)ల దగ్గర జనరిక్స్‌ను తయారు చేయిస్తున్నాం. అధునాతన టెక్నాలజీలతో వాటి నాణ్యతను మేము కూడా స్వయంగా పరీక్షిస్తాం.

పలు దిగ్గజ ఫార్మా సంస్థలకు కూడా ఈ సంస్థలు జనరిక్స్‌ అందిస్తున్నాయి. తమ ఫ్యాక్టరీల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్‌ యూనియన్‌ నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నాయి. కాబట్టి నాణ్యత విషయంలో రాజీ ఉండదు. అదే సమయంలో వేల సంఖ్యలో ఉన్న మా స్టోర్స్‌ ద్వారా విక్రయించడంతో మాకు మార్కెటింగ్పరమైన వ్యయాలు ఉండవు కాబట్టి ఆ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు నేరుగా బదలాయించగలుగుతున్నాం’’ అని మధుకర్‌ వివరించారు. దేశీ ఫార్మా విభాగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, వైద్య పరీక్షల సేవలనూ గణనీయంగా విస్తరిస్తున్నామన్నారు. మెడ్‌ప్లస్‌కి ప్రస్తుతం పది రాష్ట్రాల్లో 4,200 పైచిలుకు స్టోర్స్‌లో సంఘటిత రిటైల్‌ ఫార్మసీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్‌ వాటా ఉంది.  

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top