భారతీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. జర్మనీలోని హ్యాంబర్గ్‌లో జరిగిన ‘వరల్డ్ ట్రావెల్ క్యాటరింగ్ అండ్ ఆన్‌బోర్డ్ సర్వీసెస్ ఎక్స్‌పో (డబ్ల్యూటీసీఈ) 2026’ వేదికగా ఇండిగో ప్రవేశపెట్టిన ప్రీమియం బిజినెస్ క్లాస్ సర్వీస్ ‘ఇండిగో స్ట్రెచ్’ పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. వినియోగదారులకు అందించే అత్యుత్తమ సౌకర్యాలు, వినూత్న డిజైన్లు, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచిన తీరుకు గాను ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ తెలిపింది.
ప్రధాన విభాగాల్లో అగ్రస్థానం
‘ట్రావెల్‌ప్లస్ ఎయిర్‌లైన్ ఎమెనిటీ అవార్డ్స్ 2026’లో ఇండిగో ప్రవేశపెట్టిన ‘బ్లాంకెట్ కలెక్టబుల్ - ఇండిగో స్ట్రెచ్ ఓవర్‌లే’కు స్వర్ణ పతకం లభించింది. ప్రాంతీయ కళలు, సాంప్రదాయక డిజైన్లతో రూపొందించిన ఈ ఓవర్‌లేలు కేవలం ప్రయాణ సమయంలోనే కాకుండా ప్రయాణికులు జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లేలా డిజైన్ చేయడం విశేషం. దీనితో పాటు లభించే బుక్‌లెట్, రియూజబుల్ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఇండిగో వినూత్న శైలిని ప్రతిబింబిస్తాయి.
ఆన్‌బోర్డ్ హాస్పిటాలిటీ అవార్డ్స్ 2026లో భాగంగా ‘బెస్ట్ ఆన్‌బోర్డ్ టెక్స్‌టైల్స్’ విభాగంలో ఇండిగో ‘హైలీ కమెండెడ్’ గౌరవాన్ని పొందింది. బిజినెస్ క్లాస్‌లో అందించే జాక్వర్డ్ ఓవర్‌లేలు, గ్లోబల్ మ్యాప్ డిజైన్‌తో కూడిన పిల్లో కవర్లు, ఐ-మాస్క్‌లు, యాంటీ-స్కిడ్ సాక్స్‌ల నాణ్యత, సౌకర్యానికి గాను ఈ పురస్కారం దక్కింది. పాక్స్ ఇంటర్నేషనల్ రీడర్‌షిప్ అవార్డ్‌లో భాగంగా సుమారు 15,500 మందికి పైగా ఏవియేషన్ నిపుణులు పాల్గొన్న ఓటింగ్‌లో ‘బెస్ట్ బిజినెస్ క్లాస్ బెడ్డింగ్/సాఫ్ట్ ప్రొడక్ట్ – సౌత్ ఆసియా’ విభాగంలో ఇండిగో విజేతగా నిలిచింది.
ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


