ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే కేవలం ఉత్పాదకతను పెంచే మంత్రదండం మాత్రమే కాదు, అది ఒక ప్రమాదకరమైన ఆటోమేషన్ ట్రాప్ అని కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఏఐని వాడుతూ ఉద్యోగులను తొలగిస్తుంటే అది చివరికి కంపెనీలకే చేటు చేస్తుందని పెన్సిల్వేనియా, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్పారు.
ఆటోమేషన్ రేసు: గెలుపెవరిది?
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన బ్రెట్ హెమెన్వే ఫాల్క్, బోస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గెర్రీ సౌకలాస్ సంయుక్తంగా రూపొందించిన ‘ది ఏఐ లేఆఫ్ ట్రాప్’ అనే పరిశోధనా పత్రం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టెక్ సంస్థలు పోటీలో ముందుండడానికి ఆటోమేషన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నాయని, ఇది చివరికి ‘అపరిమిత ఉత్పాదకత - సున్నా డిమాండ్’ అనే వినాశకర స్థితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఏఐని ఆశ్రయిస్తున్నాయి. కానీ ప్రజల చేతుల్లో ఉద్యోగాలు లేకపోతే మార్కెట్లో వస్తువులను కొనే శక్తి తగ్గిపోతుంది. వినియోగదారుల డిమాండ్ పడిపోతే ఆ కంపెనీల ఉత్పత్తులను ఎవరు కొంటారు?’ అని ఈ అధ్యయనం ప్రశ్నిస్తోంది.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వాస్తవ ప్రపంచ పరిస్థితులు ఈ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. టెక్ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ కోతలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 2025లో టాప్ కంపెనీల్లో మొత్తం 1,00,000 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు. ఇందులో సగానికి పైగా కారణం ఏఐ వినియోగమే. 2026 (ఇప్పటివరకు) కేవలం నాలుగు నెలల్లోనే 98 కంపెనీలు సుమారు 92,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
పరిష్కారం ఏమిటి?
యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ (యూబీఐ) లేదా రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ల వంటివి ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమేనని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. దీనికి అసలైన పరిష్కారం ‘పిగౌవియన్ ఆటోమేషన్ పన్ను’ అని పరిశోధకులు సూచిస్తున్నారు. అంటే ఆటోమేషన్ వల్ల సమాజానికి కలిగే డిమాండ్ నష్టాన్ని కంపెనీలే భరించేలా చేయడం. కేవలం లాభాల కోసమే కాకుండా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించాలని నివేదిక తెలుపుతుంది.
ఏఐ సాంకేతికత మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ కంపెనీల మధ్య పోటీ ఆటోమేషన్ రేసుగా మారుతోంది. దీన్ని ఆపడం ఒక్క కంపెనీ వల్ల సాధ్యం కాదు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సరైన విధానపరమైన పన్ను నిబంధనలు తీసుకురాకపోతే సంస్థలు తాము తవ్వుకున్న గోతిలో తామే పడే ప్రమాదం ఉంది. మేధోశక్తికి, మానవ వనరులకు మధ్య సమతుల్యత దెబ్బతింటే అది కేవలం కార్మిక మార్కెట్ సమస్యే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు.
ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’


