ఆక్వా రంగంపై సర్కారు కక్ష | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రంగంపై సర్కారు కక్ష

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

చంద్రబాబు ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం

రైతుల ప్రయోజనాలపై నిర్లక్ష్యం

చట్టం ఉన్నా ఖాతరు చేయని ఫీడ్‌ కంపెనీలు

ఇబ్బడిముబ్బడిగా ధరల పెంపు

మరోవైపు రొయ్యల ధరలు తగ్గించిన సంస్థలు

వైఎస్‌ జగన్‌ రైతులకిచ్చిన బ్రహ్మాస్త్రం ‘ఏపీ సడా’

చంద్రబాబు ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఫీడ్‌, కెమికల్‌, మెటీరియల్‌ (రొయ్యలు) ధరలు తరచూ పెంచి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న కంపెనీలకు ముకుతాడు వేసేందుకు 2020లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘అప్సడా’ను తీసుకొచ్చింది. అప్పటి వరకూ ఫీడ్‌, కెమికల్‌తోపాటు రొయ్యల కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరించాయి. దేశం మొత్తం రొయ్యలసాగులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటా 70 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ‘అప్సడా’ సంస్థ పనిచేస్తుంది. కమిటీలో రైతు నాయకులు ఉంటారు. అందరితో చర్చించి కమిటీ రొయ్య రైతుల ప్రయోజనాల కోసమే పనిచేసేలా చట్టం రూపొందించారు. ఫీడ్‌, మెటీరియల్‌, కెమికల్‌ కంపెనీలతోపాటు రొయ్యల ప్రాసెసింగ్‌ కంపెనీలు, యాచరీస్‌లను అప్సడా పరిధిలోకి తెచ్చారు. కంపెనీలు అడ్డగోలుగా ధరలు పెంచడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టారు. యాచరీస్‌ నకిలీ సీడ్‌ విక్రయించకూడదు. ప్రాసెసింగ్‌ కంపెనీలు రైతులకు తక్కువ ధరలు ఇచ్చినా అప్సడా జోక్యం చేసుకుంటుంది. 2022లో థాయిలాండ్‌కు చెందిన సీపీ కంపెనీ ఫీడు ధరలను రూ. 5 పెంచితే స్పందించిన అప్సడా.. చైర్మన్‌ను పిలిపించి పెంచిన ధరను వెనక్కి తీసుకునేలా చేశారు.

అదే సంవత్సరం డిసెంబర్‌లో.. పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరులలో ఎగుమతి దారులు రొయ్యలు కొనకపోవడంతో అప్సడా జోక్యం చేసుకుని కొనిపించింది. ప్రకాశం, నెల్లూరు, భీమవరం ప్రాంతాల్లో రొయ్యల సీడు దెబ్బతినగా యాచరీస్‌ల మెడలు వంచి తిరిగి రైతులకు సీడ్‌ ఇప్పించింది.

చేతులెత్తేసిన పాలకులు

చంద్రబాబు పాలనలో ఫీడు కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుకున్నా, రైతులకు ఇచ్చే రొయ్యల ధరలు తగ్గించినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఫిబ్రవరి నెలలో కిలోకు రూ.4 చొప్పున ఫీడ్‌ ధరలను పెంచిన కంపెనీలు మే నెల 11న వెనామీ ఫీడ్‌కు రూ.8, టైగర్‌ ఫీడ్‌కు రూ.10 చొప్పున పెంచాయి. ఈ విషయం అటు ప్రభుత్వం, అప్సడాతోపాటు రైతులకు చెప్పలేదు.

మంత్రిని ముందుపెట్టి కథ నడిపిస్తూ..

మంత్రి అచ్చెన్నాయుడిని ముందు పెట్టి ప్రభుత్వం ఫీడ్‌ కంపెనీల ప్రయోజనాల కోసం తంటాలు పడుతున్నట్లు విమర్శలున్నాయి. మూడు రోజుల క్రితం మంత్రి నిర్వహించిన సమావేశం భీమవరం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఫీడ్‌ ధరలు పెంచుకోనివ్వకపోతే..ప్లాంట్లు మూసివేస్తామని కంపెనీలు బెదిరిస్తున్నాయని కొందరు రైతు ప్రతినిధులను మంత్రి హెచ్చరించినట్లు ప్రచారం ఉంది. దీనిపై రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. అమలాపురం ప్రాంతానికి చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్‌ నాయకుడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, జనసేన నేతలను ఏపీ అప్సడా ప్రతినిధులుగా ఎంపిక చేశారని, వారికి రొయ్యల చెరువులతో సంబంధం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

రొయ్య రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీ సడా)ను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ చట్టాన్ని పక్కన పెట్టి రొయ్య రైతుల ప్రయోజనాలకు గండి కొడుతోంది. చట్టాన్ని ఖాతరు చేయకుండా ఫీడ్‌ కంపెనీలు, రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సర్కారు రొయ్య రైతుల ప్రయోజనాల కోసం కాకుండా ఫీడ్‌ కంపెనీల లబ్ధి కోసం పని చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement