హత్య కేసులో దంపతుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో దంపతుల అరెస్టు

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

చిలకలూరిపేట: వ్యక్తిని దారుణంగా హతమార్చిన దంపతులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఎస్‌ఎంఎస్‌ షాదీఖానా సమీపంలో షేక్‌ కాలేషావలి, షేక్‌ మనీషా దంపతులు నివాసం ఉంటారు. మనీషాకు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్‌ జాకీర్‌ హుస్సేన్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. కాలేషావలి రెడ్ల బజారులో వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ మనీషా, జాకీర్‌హుస్సేన్‌ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. జాకీర్‌ హుస్సేన్‌ జీవించి ఉన్నంత కాలం తమ మధ్య గొడవలు తప్పవని, అతనిని అడ్డు తొలగించుకొని సంతోషంగా ఉందామని భార్యకు నచ్చ చెప్పాడు. దీనికి అంగీకరించిన మనీషా తన భర్త చెప్పిన ప్రకారం జాకీర్‌ హుస్సేన్‌ను ఈ నెల ఒకటో తేదీన ఫోన్‌ చేసి పిలిపించింది. జాకీర్‌ హుస్సేన్‌ వచ్చాక దంపతులు ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని వాహనం ద్వారా తీసుకువెళ్లి వేలూరు– జాలాది రోడ్డులో పడవేశారు. రెండో తేదీన మృతదేహాన్ని గుర్తించిన జాకీర్‌హుస్సేన్‌ భార్య షేక్‌ షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇరువురు సెల్‌ఫోన్లతోపాటు మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనం, మృతుడి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బి సుబ్బానాయుడు, రూరల్‌ ఎస్‌ఐ జి అనిల్‌కుమార్‌ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement