మార్కెట్‌లోకి రాని పాఠ్యపుస్తకాలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి రాని పాఠ్యపుస్తకాలు

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఎస్‌సీఈఆర్‌టీ నిర్లక్ష్యం వల్లే...

ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులోకి రాని పుస్తకాలు రేపు పునః ప్రారంభంకానున్న పాఠశాలలు మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బందులు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముందే మార్కెట్లో సిద్ధంగా పుస్తకాలు

ఎస్‌సీఈఆర్‌టీ నిర్లక్ష్యం వల్లే...

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో టీడీపీ సర్కారు విఫలమైంది. 2026–27 నూతన విద్యాసంవత్సరం శుక్రవారం ప్రారంభం కానుండగా, అదే రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా రూపొందించిన పాఠ్య పుస్తకాలను ప్రైవేటు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పుస్తకాలు ఇంకా రాలేదని దుకాణదారులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠ్యాంశాల బోధన తప్పనిసరి

ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలతో పూర్తిస్థాయిలో బోధన చేసేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలను విధిగా కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలతో వ్యవస్థను గాడిలో పెట్టారు. వైఎస్సార్‌ సీపీ పాలనకు ముందు టీడీపీ హయాంలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో యాజమాన్యాలు రూ.వేల ఖర్చుతో ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్‌ క్యాలండర్‌కు విరుద్ధంగా సొంత సిలబస్‌ను బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో బోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సేల్‌ టెక్ట్స్‌బుక్స్‌కు ఇండెంట్‌ తీసుకుంటున్న విద్యాశాఖ ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలకు అదనంగా సేల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను ముద్రించి, విక్రయాలు జరిపింది.

ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను బహిరంగ మార్కెట్లో సిద్ధం చేయడంలో ఎస్‌సీఈఆర్‌టీ విఫలమైందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలను అందించలేని దుస్థితి నెలకొందని, పాఠశాలలు తెరిచిన తరువాత పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలవారీగా హెచ్‌ఎం లాగిన్‌ ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెట్టి, నేరుగా ముద్రణదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అంటున్నారు. పాఠశాలలు రీ ఓపెన్‌ చేసేందుకు వ్యవధి దగ్గర పడినప్పటికీ పాఠ్య పుస్తకాలు సైతం అందించలేని దుస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ఆరోపణలు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement