పొగాకు బాధితులకు చేదు వార్త | - | Sakshi
Sakshi News home page

పొగాకు బాధితులకు చేదు వార్త

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

పొగాకు బాధితులకు చేదు వార్త

జీజీహెచ్‌లో నిండుకున్న నికోటిన్‌ ప్యాచ్‌లు ధూమపానం మానాలంటే ఈ ప్యాచ్‌తోనే చికిత్స సిబ్బందికి సైతం రెండు నెలలుగా వేతనాలు కరువు

గుంటూరు మెడికల్‌: యవ్వనంలో సరదా కోసం స్మోకింగ్‌కు అలవాటు పడినవారు ఆ అలవాటు మానాలనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి గుంటూరు జీజీహెచ్‌ మానసిక వ్యాధుల విభాగంలో డీ అడిక్షిన్‌ సెంటర్‌, పొగాకు మాన్పించే కేంద్రం ఉన్నాయి. వీటిలో చికిత్స కోసం ప్రతి రోగి పది నుంచి 15 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు, ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్‌లాంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారు సైతం జీజీహెచ్‌కు వస్తున్నారు. వీరికి ఆ అలవాటును మాన్పించేందుకు శరీర భాగంలో ఛాతీకి లేదా భుజానికి లేదా తొడకు వెంట్రుకలు లేని ప్రాంతంలో నికోటిన్‌ ట్రాన్స్‌థర్మల్‌ ప్యాచ్‌ను అంటించి కౌన్సెలింగ్‌ చేస్తారు. ఇలా ప్రతినెలా బాధితులు పొగాకు ఉత్పత్తులు విడనాడుతున్నారు. మందులు మింగే పనిలేకుండా కేవలం ఒక స్టిక్కర్‌ మాదిరిగా నికోటిన్‌ ప్యాచ్‌ను అంటించుకోవడం ద్వారా పొగాకు వినియోగాన్ని సునాయాసనంగా విడిచి పెట్టడంతో రోజూ జీజీహెచ్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. కానీ ప్యాచ్‌లు ఆరు నెలలుగా జీజీహెచ్‌లో స్టాక్‌ లేవు. వాస్తవానికి ఈ ప్యాచ్‌లను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో వీటి ఖరీదు నెలకు రూ.3 వేలకుపైగా ఉంటుంది. పలువురు బాధితులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేక కౌన్సిలింగ్‌ చేయించుకున్నప్పటికీ ప్యాచ్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా రోజువారి కూలీలు, దిగువ మధ్యతరగతి వారు బాధితులుగా ఉన్నారు. ఆరు నెలలుగా స్టాకు లేక బయట కొనుగోలు చేసే స్థోమత లేక పొగరాయుళ్లు సతమతం అవుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు కేవలం గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం నికోటిన్‌ ప్యాచ్‌ల కోసం పొగ అలవాటును మానాలనే ఉద్దేశంతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు.

జీతాలకు కూడా దిక్కులేదు...

డీ అడిక్షన్‌ సెంటర్‌, పొగాకు మాన్పించే కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు కూడా విడుదల కాలేదు. ఇరువురు కౌన్సిలర్లు, ఇరువురు నర్సింగ్‌ సిబ్బంది, ఇరువురు నాలుగో తరగతి ఉద్యోగులు, మెడికల్‌ ఆఫీసర్‌ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పొగరాయుళ్లుకు చెడు అలవాట్లు మాన్పించటంలో సహాయపడుతున్నారు. ఒక పక్క నికోటిన్‌ ప్యాచ్‌లు లేక, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు విడుదల కాక డీ అడిక్షన్‌ సెంటర్‌ పనితీరు దిగజారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి పొగాకు వినియోగంలాంటి చెడు అలవాట్లు విడనాడాలనుకునే వారికి నికోటిన్‌ ప్యాచ్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలు విడుదల అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement