ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

బాపట్ల: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా, ఎరువుల విక్రయాలపై అన్ని నియోజకవర్గాలు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో 2002 ఓటర్ల జాబితాకు 2019 ఓటర్ల జాబితాను సరిపోల్చి చూడాలని ఆదేశించారు. బుధవారం 8,316 ఓట్లను పరిశీలించి విచారించినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 151 మంది బీఎల్వోలు పనితీరులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఏమిటని నిలదీశారు. నిర్లిప్తంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ఇప్పటివరకు ఓటర్ల నుంచి 453 ఫోన్‌ కాల్స్‌ రాగా 418 పరిష్కరించామన్నారు. బీఎల్‌ఓలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనగణన నమోదు ప్రక్రియలో సవరణలకు ఈనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్‌ చెప్పారు. జనగణన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పరిశీలించి తప్పులు, పొరపాట్లు లేకుండా జనగణ నమోదు చేయాలన్నారు.

పారదర్శకంగా ఎరువుల విక్రయాలు

ఎరువుల విక్రయాలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో 14,896 టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా 1,62,366 మంది రైతులు ఉన్నారన్నారు. ఎరువుల విక్రయాలు పక్కదారి పట్టకుండా, సమర్థంగా నిర్వహించడానికి రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 91,115 మంది పేర్లు నమోదు చేసినట్లు వివరించారు. ఆన్‌లైన్‌లో ఉన్న నిల్వలు ఫిజికల్‌గా ఉన్న నిల్వలు సమానంగా ఉండాలని, అలా లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ అధికారి ఎ.లక్ష్మి, ఆర్డీవోలు, మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు, బీఎల్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement