ఓ కేసులో అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు త్వరలో గుంటూరు జిల్లాకు తరలించే అవకాశాలు
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ దాదాపు 70 రోజుల తర్వాత తమిళనాడు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెం గ్రామం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్‌కుమార్ (29) ఓ కేసులో ఒంగోలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వారెంట్ ముద్దాయి అయిన అతన్ని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ ఏడాది మార్చి 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. పరారయ్యేందుకు జైల్లోనే పథకం రూపొందించాడు. మార్చి 25న ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలికి శస్త్రచికిత్స చేయగా నొప్పిగా ఉందని సబ్ జైలు అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స పొందే క్రమంలో 28న అజిత్‌కుమార్ మూత్రవిసర్జనకి వెళ్తున్నానని పరారైన విషయం విదితమే. రేపల్లె సబ్ జైలు అధికారికి ఆన్‌లైన్‌లో నగదు చెల్లించారనేది విచారణలో బహిర్గతమైంది. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ జాగ్రత్త పడటంతో నెలలు గడిచాయి. తమిళనాడులోని తిరుపూర్‌లో క్రైం విభాగం పోలీసులు సుమారు వారం క్రితం ఓ కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం. అతన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు పోలీస్ బృందం వెళ్లినట్లు తెలిసింది. పరారీ ఘటపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిపై ఇప్పటికి విచారణ చేస్తున్నారు.


