జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్
బాపట్ల: మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగా మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, నేరాలకు పాల్పడిన 301 మందిపై షీట్లను తెరిచినట్లు తెలిపారు. గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై, పాత నేరస్తులపై, చెడు నడత కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు ఎటువంటి వ్యక్తులను కలుస్తున్నారు. ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందా అనే కోణంలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచి పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన‘ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ప్రధాన ఉద్దేశం మహిళలకు భద్రత కల్పించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడినా, వారికి న్యాయస్థానాలలో కఠినమైన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మహిళా సంబంధిత కేసులను వేగవంతంగా దర్యాప్తు నిర్వహించి 60 రోజులలోపే ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు, కేసు తీవ్రతను బట్టి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతంగా విచారణ జరిపించి నేరస్తులకు కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ‘ఆపరేషన్ దండాయన‘ కార్యక్రమంలో భాగంగా గత వారంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 26 మందిపై సస్పెక్ట్ షీట్‌లు తెరిచినట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా మహిళల పట్ల, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మహిళలకు అండగా జిల్లాలో ఐదు శక్తి టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శక్తి టీమ్ లో ఒక్కొక్క టీంకు ఎస్సై స్థాయి అధికారిని ఇన్‌చార్జీగా నియమించామన్నారు. వీరు కాలేజీలు, పాఠశాలలు బస్టాండ్‌లలో, రైల్వేస్టేషన్‌లలో ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఆకతాయిల వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటూ, మహిళ భద్రత, దానికి సంబంధించిన చట్టాల గురించి మహిళల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, శక్తి యాప్ వినియోగం గురించి మహిళలు, విద్యార్థినులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. అంతేకాకుండా నిర్మానుష్యమైన ప్రదేశాలలో, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, తక్షణ పోలీస్ సహాయం కావాలన్నా వెంటనే శక్తి యాప్ వినియోగించుకోవాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి తక్షణం పోలీస్ సహాయం పొందాలన్నారు. మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లాలోని శక్తి బృందాలు, స్థానిక పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.


