1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ భైరవకోన సభ్యులు డిమాండ్ చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నగంటి లక్ష్మి, వి.ఎం.సుహాసిని మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డీఎస్సీలో కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1,369 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్లా చంద్రయ్య, డి.ఆదినారాయణ, డి.నాగేశ్వరరావు, టి.ఏసుబాబు, సీహెచ్‌ఎల్‌వీ తులసి, ఆర్.రామారావు పాల్గొన్నారు.


