చిత్తశుద్ధితో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితో పనిచేయాలి

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు

బాపట్లటౌన్‌: రహదారుల ప్రమాదాలు 20 శాతానికి తగ్గించేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద సంరక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగు నెలల్లో 116 ప్రమాదాలు జాతీయ రహదారులపై నమోదయ్యాయన్నారు. ప్రధానంగా ఎన్‌హెచ్‌ఏ 16లో మార్టూరు–రాజుపాలెం వద్ద, ఎన్‌హెచ్‌ఏ 216లో చిన్నగంజాం సాయిబాబా విగ్రహం వద్ద, ఎన్‌హెచ్‌ఏ 167ఏ చీరాల–ఓడరేవు, పర్చూరు ఏబీవారిపాలెం వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద వేగ నియంత్రణకు డ్రమ్ములు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలు కలిసేచోట సూచిక, హెచ్చరిక బోర్డులు, ఐమాక్స్‌ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఐమాక్స్‌ లైట్ల నిర్వహణ బాధ్యత స్థానిక పంచాయతీలు, జాతీయ రహదారులదేనన్నారు. రహదారుల వెంబడి విద్యుత్‌ దీపాలకు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్‌ 167ఎ ఓడరేవు వద్ద 200 మీటర్ల వరకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని, కూడలి, రహదారి వంపులలో కాంకే మిర్రర్‌ ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిని అడ్డుకోడానికి 16 బ్రీత్‌ ఎనలైజర్స్‌ యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో సిగ్నల్‌ లైట్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. కుంకులమర్రు వద్ద జాతీయ రహదారిపైకి గేదెలు రాకుండా బ్యారికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాలు, పెట్రోల్‌ బంకులు, ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యత పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా ట్రాఫిక్‌ పర్యవేక్షణ, ప్రమాదాల నివారణకు ఎంతగానో సహకరిస్తుందన్నారు.‘శిరో రక్ష – ప్రాణరక్ష’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రజలలో చైతన్యం వస్తుందన్నారు. కమిటీలోని ప్రతి విభాగం సమర్థంగా పనిచేయడం ద్వారా ప్రస్తుతం ఎనిమిది శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారి పరంథామరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం వనజ, ఎన్‌హెచ్‌ఏ అధికారి ఖాదర్‌, బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.హాసిని, డీఎస్పీలు పి.జగదీష్‌ నాయక్‌, ఏ.శ్రీనివాసరావు, సీహెచ్‌.చంద్రమౌళి, ఎండీ.మొయిన్‌ పాల్గొన్నారు.

పంట నమోదు చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా, డీఏపీ అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ తెలిపారు. 2026 – 2027 సంవత్సరానికి రైతులకు యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే యూరియా, డీఏపీ ఎరువులపై అతి పెద్ద రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యూరియా, డీఏపీ వ్యవసాయేతర అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టడానికి డిజిటల్‌ విధానం అమలుచేయడానికి సిద్ధమైందన్నారు. రైతులు తమ ఆధార్‌ నంబర్లను రైతుసేవా కేంద్రం, పీఏసిఎస్‌లు, అధీకృత రిటైల్‌ డీలర్లకు అందించి ఓటీపీ చెప్పటం, వేలిముద్ర వేయటం ద్వారా యూరియా, డీఏపీలను కొనుగోలు చేయవచ్చన్నారు. రైతులు తమకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రాల నుంచి ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్‌ ద్వారా కల్పించడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాకు కేటాయించిన యూరియా డిఏపి ఎరువులను జిల్లా పరిధిలోనే అమ్మకాలు జరగాలన్నారు. జిల్లా హోల్‌సేల్‌ గోడౌన్లు, గోడౌన్‌ సామర్‌ాధ్యన్ని బట్టి రైతుసేవా కేంద్రాలు, పి.ఎ.సి.ఎస్‌.లు, డీసీఎంఎస్‌ల దగ్గర బఫర్‌ స్టాక్‌ నిల్వ ఉంచడమైందన్నారు. బాపట్ల జిల్లాకి ఖరీఫ్‌ 2026–27 సంవత్సరంకు యూరియా 27165, డీఏపీ 13977 అవసరం కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా 13557, డీఏపీ 5145 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఎ.లక్ష్మి, ఏడీఏ అన్నపూర్ణ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement