వ్యవసాయ పనిముట్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పనిముట్లు దగ్ధం

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

ఇంకొల్లు(చినగంజాం): చెత్తకు పెట్టిన నిప్పు అంటుకుని ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన వెనిగండ్ల చంద్రశేఖర్‌కు చెందిన వ్యవసాయ పనిముట్లు నూతనంగా నిర్మిస్తున్న వైద్యశాల పక్కన ఉంచాడు. అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికుడు తగలబెట్టేందుకు నిప్పు అంటించాడు. తీవ్రమైన గాలి ధాటికి మంటలు చెలరేగి చంద్రశేఖర్‌కు చెందిన 200 స్ప్రింక్లర్‌ పైపులు, నీళ్ల ట్యాంకు, 2 ఫుట్‌ వాల్వ్‌లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పారు.

మృతదేహంతో ఇంటి ముందు నిరసన

గుంటూరు రూరల్‌: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్‌ మెంట్‌లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది.

జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్‌ కోచ్‌ కాశీనాఽథ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్‌ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్‌, ఒకరు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, సక్సెస్‌ స్కూల్‌ డైరెక్టర్‌ బి.సాయి మల్లికార్జున్‌, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు.

విద్యుత్‌శాఖ విజిలెన్స్‌ తనిఖీలు

గుంటూరు రూరల్‌: విద్యుత్‌శాఖ విజిలెన్స్‌ విభాగం, ఆపరేషన్‌ విభాగం గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్‌ సీహెచ్‌ రమేష్‌ ఆధ్వర్యంలో డీ 7 గుంటూరు సెక్షన్‌ గోరంట్ల, జొన్నలగడ్డ, రెడ్డిపాలెం గ్రామాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ డీపీఈ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ ఖాన్‌ల నేతృత్వంలో 52 మంది అధికారులు, 156 మంది సిబ్బంది 52 బృందాలుగా ఏర్పడి 3941 సర్వీసులను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా మీటరు ఉన్నప్పటికీ విద్యుత్‌ అక్రమ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.50 వేలు, అనుమతించిన కేటగిరికంటే ఇతర కేటగిరిలో విద్యుత్‌ వినియోగిస్తున్న ఆరుగురికి రూ.50 వేలు, అనుమతించిన లోడు కంటే అధికంగా విద్యుత్‌ వినియోగిస్తున్న 361 మందికి రూ 20.2 లక్షలు, అసలైన వినియోగం కంటే తక్కువగా బిల్లులు ఇవ్వబడిన ఒక సర్వీసుకు రూ.5 వేలు వంతున మొత్తం రూ 21.7 లక్షల అపరాధ రుసుం విధించటం జరిగిందని తెలిపారు. విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్‌ చౌర్యంపై ఎవరైనా 9440812263, 94408112361 నంబర్లకు నేరుగా కానీ వాట్సప్‌ ద్వారా కానీ సమాచారం అందించవచ్చని అటువంటివారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆపరేషన్స్‌ విభాగం డీఈఈ గురవయ్య, విజిలెన్స్‌ డీఈఈలు మల్లికార్జునప్రసాద్‌, రవికుమార్‌, ఆపరేషన్స్‌ ఏఈ వెంకటేశ్వర్లు, విజిలెన్స్‌ ఏఈఈలు శివశంకర్‌, సతీష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement