అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్
కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్‌సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్‌ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఏ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


