తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్‌పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్‌లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్‌లోని కుమార్‌పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్‌కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్‌వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు.
14న డాక్టర్ కె.రామ్‌చంద్‌కు జీవనసాఫల్య పురస్కారం


