కరుణ మరచి కాసుల కక్కుర్తి | - | Sakshi
Sakshi News home page

కరుణ మరచి కాసుల కక్కుర్తి

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకుల దోపిడీ నరసరావుపేట ఏరియా ఆసుపత్రి అడ్డాగా మాఫియా మృతదేహాల తరలింపునకు పెద్ద మొత్తంలో డిమాండ్‌ రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి కమీషన్ల దందా అక్రమాలపై కన్నెత్తి కూడా చూడని ఉన్నతాధికారులు

మెరుగైన

వైద్యం పేరుతో

దోపిడీ..

నరసరావుపేట టౌన్‌ : పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్‌ల దందా కొనసాగుతోంది. రోజూ వేలాది మంది రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు. వారిలో అధిక శాతం నిరుపేదలే. చికిత్స పొందుతూ రోగి మృతి చెందితే ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు గుమికూడి దందాకు తెరలేపుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల నిస్సహాయ పరిస్థితులను ఆసరా చేసుకొని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాకు కేటాయించకపోవటంతో పేదలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఏరియా ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని అంబులెన్స్‌ దందా కొనసాగిస్తున్నారు.

దుఃఖంలో ఉన్నా వదిలేదే లేదు..

ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు రూ.వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అయితే రూ.3,500 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర గ్రామాలకై తే పరిధిని బట్టి రూ.10,000 వరకు అడుగుతున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల నిస్సహాయతను లక్ష్యంగా చేసుకొని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఇలా డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉచిత సేవలు లేకపోవటంతో గత్యంతరం లేక అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు.

సిబ్బంది పాత్రపై ఆరోపణలు

ఈ వ్యవహారం వెనుక ఆసుపత్రి సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి వివరాలు, పరిస్థితి, బంధువుల వివరాల సమాచారం ముందుగానే అంబులెన్స్‌ నిర్వాహకులకు చేరుతోందని సమాచారం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన సేవలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు, వైద్యశాల సిబ్బంది సలహాల మేరకు నరసరావుపేటలోని పలు ప్రైవేటు వైద్యశాలలకు పేదలు వెళుతున్నారు. దీంతో వారిపై పెను ఆర్థికభారం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు కూడా ఈ దందాకు అతీతం కావటం లేదు. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఇతర అత్యవసర సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారి చుట్టూ ప్రైవేటు అంబులెన్స్‌ సిబ్బంది చేరుతున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందదని భయపెడుతున్నారు. మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు వైద్యశాల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే చేరిన రోగులను సైతం ప్రైవేటు ఆసుపత్రుల వైపు మళ్లిస్తున్నారు. రోగుల భయాలను, అవసరాలను వీరు సొమ్ము చేసుకుంటున్నారు. పేషెంట్‌ను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లడానికి కొంత మొత్తం తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినందుకు కమీషను దండుకోవటం వారికి నిత్యకృత్యంగా మారింది. క్షతగాత్రులను అర్హత లేని వైద్యశాలలకు తరలించి ప్రాణాలమీదకు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement