గళమెత్తిన న్యాయవాదులు | - | Sakshi
Sakshi News home page

గళమెత్తిన న్యాయవాదులు

Jun 10 2026 1:25 AM | Updated on Jun 10 2026 1:25 AM

చినగంజాం మండల సివిల్‌, క్రిమినల్‌ కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ ధర్నా కక్షిదారులు ఇబ్బందులు పడతారంటూ ఆవేదన చీరాల కోర్టులోనే కేసులను ఉంచాలంటూ డిమాండ్‌ గంటపాటు రోడ్డుకు రెండువైపులా స్తంభించిన వాహనాలు

చీరాల రూరల్‌: చినగంజాం మండలంలోని అన్ని సివిల్‌, క్రిమినల్‌ కేసులను చీరాల కోర్టుల నుంచి పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ బార్‌ అసోసియేషన్‌, అడ్‌హక్‌ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. చినగంజాం మండల సివిల్‌, క్రిమినల్‌ కేసులను పర్చూరు కోర్టుకు బదలాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చీరాల–వాడరేవుపై ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు చీరాల కోర్టుల్లోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీనియర్‌ న్యాయవాదులు శ్రీకాంత్‌ ఠాకూర్‌, మిక్కిలి పుల్లయ్య, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పింజల ప్రసాద్‌, గౌరవ రమేష్‌బాబు మాట్లాడారు. చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు మార్చినట్లయితే ఆయా మండలానికి చెందిన అనేక గ్రామాల కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడతాయని చెప్పారు. చినగంజాం పరిసర గ్రామాలకు చెందిన కక్షిదారులు పర్చూరు కోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాలన్నారు. పర్చూరుకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కూడా లేదని, కక్షిదారులు సుమారుగా 60 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని తద్వారా వారికి సమయంతో పాటు డబ్బు అధికంగా ఖర్చు అవుతాయని తెలిపారు. చినగంజాం పరిసర గ్రామాల కక్షిదారులు చీరాల చేరుకోవాలంటే అనేక రవాణా సదుపాయాలున్నాయని ముఖ్యంగా రైలుబండ్లు, బస్సులు నిరంతరాయంగా ఉంటాయని దూరం కూడా 20 కిలో మీటర్లులోపే ఉంటుందని వారు తెలిపారు. ఉన్నత న్యాయ స్థానాలు న్యాయం మన ఇంటి ముంగిటకే వస్తుందని చెప్పే మాటలన్నీ నీటి మూటలని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా జరిగితే అప్పుడు కూడా ఉద్యమాలు చేపట్టి చీరాల కేసులు పర్చూరు కోర్టులకు వెళ్లకుండా ఆపగలిగామని చెప్పారు. పర్చూరు కోర్టులో కేసులు తక్కువగా ఉండడం కారణంగానే చినగంజాం మండల కేసులన్నింటిని చీరాల నుంచి పర్చూరు కోర్టుకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని వారు విమర్శించారు. చీరాల కోర్టులోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు బదలాయింపును తక్షణమే ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేసి కోర్టు విధులను కూడా బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కరవది భానుప్రకాష్‌, అనిశెట్టి రాంబాబు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, చెల్లా సురేష్‌, కాజా సుబ్రహ్మణ్యం, కొటిక ఉదయ భాస్కర్‌, మల్లారపు రామకృష్ణ, ఆసాది రామకృష్ణా రెడ్డి, పల్లగొర్ల సుబ్రహ్మణ్యం, గోదావరి సురేష్‌, బిళ్లా ఆరోగ్యరావు, దర్శి చైతన్య, ఎం.మధుబాబు, సీహెచ్‌.రామారావు, వెంకటేష్‌, మహిళా న్యాయవాదులు స్నేహ, కల్పన, రాధ, జాస్మిన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement