తిరోగమనంలో బాపట్ల అభివృద్ధి
పేదలను వంచించిన ఘనుడు చంద్రబాబు
బాపట్లటౌన్: అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేసిన ఘనుడు చంద్రబాబు అని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి తెలిపారు. పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ హాల్‌లో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పుర ప్రముఖులు, మేధావులు రిటైర్డ్ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, వాణిజ్య, వ్యాపార రంగాల ప్రముఖులు, ఆడిటర్లు, మహిళలు, రైతులు పాల్గొని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంభిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కోన రఘుపతి ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఏ విధంగా వంచనకు గురిచేసిందనే విషయాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు.
సంక్షేమాన్ని ఇంటికి చేర్చిన ఘనత వైఎస్ జగన్‌దే..
కోనరఘుపతి మాట్లాడుతూ 2019–24 లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, అప్పటిముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డీబీటీ విధానం ద్వారా ప్రతి రూపాయి ప్రజలకే అందే విధంగా చేశారన్నారు. సుమారు 8.7 కోట్ల లబ్ధిదారులకు రూ.2.73 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీలు 56వేల స్కూల్స్, ఆసుపత్రులను నాడు–నేడు విప్లవం ద్వారా తీర్చిదిద్దడం ఉన్నత విద్యకి 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వటం వంటి విప్లవాత్మకమైన మార్పులు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో 15 వేల సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు 10,000 విలేజ్ క్లినిక్‌లు, 542 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటుచేసి ప్రజల ముంగిటకే అభివృద్ధి ఫలాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. వాటితోపాటు పేదలందరికీ 30 లక్షల ఇళ్ల పట్టాల ద్వారా 22 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణంలో ఉంచడం ద్వారా ఒక చరిత్ర సృష్టించారన్నారు. కరోనా లాంటి ఉపద్రవం సంభవించినా ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఉత్తమసేవలు అందించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు.ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి అందరినీ వంచించిన ఘనుడు చంద్రబాబు అన్నారు.
బాపట్లను అన్నివిధాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు నాడు కష్టపడి జిల్లా సాధనకు కృషిచేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో జిల్లాను సాధించుకొని అన్నివనరులు సమకూర్చుకుంటూనే బాపట్ల పట్టణంలో రోడ్లు, పర్యాటకంగా సూర్యలంక తీరం, మెడికల్ కళాశాల పనులు జరుగుతున్న తరుణంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చిందన్నారు. సూర్యలంక బీచ్ దగ్గర చేస్తున్న అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా ఒక ప్రణాళిక లేకుండా ఉన్నాయన్నారు. బాపట్ల మెడికల్ కళాశాల, సూర్యలంక అభివృద్ధి పనులకు ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేశామనే అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు.


