వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన
బాపట్లటౌన్: నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలాడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోనరఘుపతి తెలిపారు. బాపట్ల జిల్లా దళిత సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దగా డీఎస్సీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని కోనరఘుపతి ప్రారంభించారు. బాపట్ల రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ పాతబస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, చీలురోడ్డు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. కోన రఘుపతి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన డేటా ఎందుకు డీలీట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెరిట్ లిస్టు ఎందుకు దాచారు, జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకోష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ పేరిట దగా..
వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు మాట్లాడుతూ లక్షాలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, మెరిట్ జాబితాలో పారదర్శకత లేక పోవడం, ఎంపిక ప్రక్రియపై సందేహాలు నెలకొన్నాయన్నారు. యువత దీనిపై తీవ్ర ఆందోళలో ఉన్నారన్నారు. వీటన్నింటిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జిచే తక్షణమే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ జాబితా ఎందుకు ప్రదర్శించలేదని.. మేసేజ్లు పంపి ఆ తరువాత డీలీట్ చేసి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించారన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.లక్షలకు అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరండీఎస్సీపై విచారణ చేయాలంటూ జిల్లా డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ సెక్రటరీ గోపి, ఎస్సీసెల్ కార్యదర్శి మండే విజయ్‌కుమార్, బాపట్ల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విప్పర్ల వెంకటేశ్వర్లు, వేమూరు ఎస్సీసెల్ అధ్యక్షులు సురేష్, చీరాల మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మహేష్, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి కటికల యెహోషువా పాల్గొన్నారు.


