అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన
ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన ప్రజల మనిషి గాదె వెంకటరెడ్డి అని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి దశదిన కర్మ, సంస్మరణ కార్యక్రమం సోమవారం ఆయన స్వగృహంలో కుమారుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాదె వెంకటరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆయన జీవితం.. రాజకీయ ప్రస్థానం అంతా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కొనసాగిందన్నారు. వెంకటరెడ్డి సతీమణి, ఆయన కుమారులు ఇతర కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు. కార్యక్రమానికి పులఖండం వెంకారెడ్డి అధ్యక్షత వహించగా దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పార్టీ శ్రేణులు, పలువురు రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించిన అనంతరం ఆయనతో ఉన్న ఆయన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితం, ఆయనతో వారికి ఉన్న అనుబంధ బాంధవ్యాల గురించి మాట్లాడారు. వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానానికి చెందిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
వెంకటరెడ్డితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న మాజీ మంత్రులు
సంస్మరణ సభలో రాష్ట్ర మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి గాదె వెంకటరెడ్డితో తమకున్న అనుబంధాన్ని సభలోగుర్తు చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు బసవపున్నారెడ్డి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆరే శ్యామల, బాచిన చెంచు గరటయ్య, కృష్ణచైతన్య, సంతనూతలపాడు బీఎన్ విజయ్‌కుమార్, రేపల్లె ఇన్‌చార్జి పీతా నాగమోహన్, పలువురు సీనియర్ నాయకులు, నియోజక వర్గంలోని ఆరు మండలాల కన్వీనర్‌లు, నాయకులు, కార్యకర్తలు, వెంకటరెడ్డి అభిమానులు, బంధువులు పాల్గొన్నారు.


