అక్రమ కేసు ఎత్తివేయాలి
మోహనరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార అండ లేకుండా ఇలాంటి దుడుకు చర్యలు జరగవని భావిస్తున్నాం. అది చేనేతలకు చెందిన ఆస్తి. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలి. నిందితులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి.
– బీరక సురేంద్ర,
దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్
చీరాలలో జరిగే అన్ని అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. స్థానికంగా జరిగే పరిణామాలపై ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నట్లు?. ప్రస్తుతం సరిదిద్దుకునే దశలో పరిస్థితి ఉంది. మోహనరావుకు న్యాయం జరిగే వరకు చేపట్టే కార్యాచరణలో మా వంతు సహకారం అందిస్తాం.
– డాక్టర్ పాలేటి రామారావు,
మాజీ మంత్రి, చీరాల టీడీపీ నేత
వివాదాస్పద భూమి చేనేత ఉమ్మడి అవసరాలకు కేటాయించింది. సిధూర్ కాలనీ ఆవిర్భావంలో చేనేతలతో పాటు, 40 మంది ఎస్సీ, ఎస్టీలకు కూడా అక్కడ స్థానం కల్పించారు. మోహనరావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. వాస్తవాలను పరిశీలించి వెంటనే అఽధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
– జంజనం శ్రీనివాసరావు,
మున్సిపల్ మాజీ చైర్మన్, చీరాల
మోహనరావు అత్యంత సహనశీలి. దేశస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి. చేనేతల వాణి. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం అంటే ప్రజా స్వామ్యం ఖూనీ అయినట్లే. ఎమ్మెల్యేకు తెలీకుండా దాడి జరుగుతుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు విషయంలో ఏం జరిగిందో మననం చేసుకోవాలి. అలానే ఇక్కడ జరిగిన పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేయించి వారి పారదర్శకతను నిరూపించుకోవాలి.
– మోహన్ కుమార్‌ధర్మా,
ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు
ఆ ప్రాంతంలో టీడీపీకి చెందిన వారే ఎక్కువ. కానీ వారికే అన్యాయం జరుగుతోంది. పరిస్థితి కంచే చేను మేసిందన్న చందంగా తయారయ్యిందని అక్కడి వారు వాపోతున్నారు. మోహనరావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అధికార అండ లేకుండా అలాంటి చర్యలకు తెగబడరు. మూడు దశాబ్దాలుగా లేని కొత్త కోణాలు వెలుగులోకి రావడం అందుకు నిదర్శనం. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– సాధు రాఘవ, వైఎస్సార్‌సీపీ వేటపాలెం
మండల అధ్యక్షుడు
మోహనరావుపై దాడి వెనుక ల్యాండ్ మాఫియా కుట్ర ఉంది. అందుకు పరోక్షంగా అధికార అండే కారణం. దాడిని ఖండిస్తున్నాం. మోహనరావును అక్కడ లేకుండా చేస్తే ఆ స్థలాన్ని కబ్జా చేయవచ్చనే కోణంలో వ్యవహారం నడిచింది. ఆయనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తి వేయాలి.
– చుండూరు వాసు,
కాంగ్రెస్ పార్టీ నాయకుడు
మోహనరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. ఆయనపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి. మోహనరావు ఒక కులానికో, మతానికో చెందినవాడు కాదు. అందరి వాడు. పేదల కోసం పనిచేసే సామాజిక కార్యకర్త. అలాంటి వ్యక్తిపై జరిడిన దాడిని తీవ్రంగా పరిగణించాలి. చేనేతలంతా ఐక్యంగా ఉద్యమించాలి. సంఘటితంగా నినదిస్తేనే న్యాయం జరిగేది.
– అవ్వారు ముసలయ్య, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు


