కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 36.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా కొల్లిపర మండలంలో 1.6 మి.మీ వర్షం కురిసింది. సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరంగిపురం మండలంలో 19.2 మి.మీ., పెదకాకాని 16.2, మంగళగిరి 14.8, గుంటూరు పశ్చిమ 14.6, వట్టిచెరుకూరు 12.4, తాడికొండ 11.6, గుంటూరు తూర్పు 11.4, చేబ్రోలు 10.2, తాడేపల్లి 9.2, కాకుమాను 8.2, దుగ్గిరాల 7.4, పెదనందిపాడు 6.2, తెనాలి 5.6, ప్రత్తిపాడు 4.6, పొన్నూరు 4.6, తుళ్లూరు మండలంలో 4 మి.మీ చొప్పున వర్షం కురిసింది.
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం బంగారు దుకాణాల సముదాయం గంటాలమ్మ చెట్టు ఏరియాలో ఉంటున్న పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా దాస్‌పూర్ గ్రామ వాసి బవానందదాస్ (72) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తలనొప్పితో బాధపడుతున్న అతను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మధ్యాహ్నాం అతను ఇంటి పైభాగంలోని స్టోర్‌లో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె రూపాలి దాసు ఫిర్యాదుతో లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తాడేపల్లి రూరల్: అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే ఎక్ట్‌స్రా కార్బొరియల్ మోంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఏక్మో) సేవలు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌లో అందుబాటులోకి వచ్చినట్లు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ లోకేష్ గుప్తా తెలిపారు. సోమవారం మణిపాల్ హాస్పిటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ అమరావతి ప్రాంతం తుళ్లూరుకి చెందిన గుమ్మా వెంకటరావు అత్యంత విషమ పరిస్థితుల్లో మణిపాల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. రోగికి ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయిందని, వివిధ రకాల పరీక్షల అనంతరం రోగికి హార్డ్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సహాయం, ప్రోన్ పొజిషనింగ్, యాంటీ బయాటిక్స్, అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా మరింత దిగజారిందని వివరించారు. రోగికి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వకపోడంతో ‘ఏక్మో’ సపోర్ట్‌తో వైద్యం ప్రారంభించారని, తాత్కాలికంగా ఊపిరితిత్తులు పనిని నిర్వహిస్తూ అవి కోలుకొనే సమయాన్ని కల్పించినట్లు తెలిపారు. 27 రోజులు రోగికి ఐసీయూలో చికిత్స అందించామని, చికిత్స సమయంలో భారీగా రక్తస్రావం జరిగిందని, వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపి నిర్వహించామని పేర్కొన్నారు. శ్వాసనాళానికి అడ్డుగా ఉన్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించామని, రెండు వారాల పాటు ఏక్మో సపోర్ట్, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపి వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికిత్స అందించామని వివరించారు. ప్రస్తుతం రోగి స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ దినేష్‌కుమార్ గొంట్ల, టి.శ్రీనివాస్, దిలీప్ రట్టి, వరుణ్ పమ్మిడి తదితరులు పాల్గొన్నారు.


