ఇద్దరు యువకులు మృతి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు యువకులు మృతి

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

ట్రాక్టర్‌ ఢీకొట్టి ఒకరు...ఆర్టీసీ బస్సు ఢీకొని మరొకరు రెండు కుటుంబాల్లో విషాదఛాయలు

బాపట్ల టౌన్‌ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సోమవారం బాపట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాపట్ల మండలంలోని రామానగర్‌కు చెందిన కొక్కిలిగడ్డ సుబ్బారావు రామానగర్‌ నుంచి బాపట్ల వెళ్తుండగా అదే సమయంలో అటువైపుగా వస్తున్న ట్రాక్టర్‌ సూర్యలంక రోడ్డులోని ప్లైఓవర్‌ బ్రిడ్జి సమీపంలో ఢీకొట్టింది. ఈ ఘటన కిందపడిపోయిన సుబ్బారావు(28) పై ట్రాక్‌ టైరు ఎక్కింది. కొన ఊపిరితో ఉన్న సుబ్బారావును వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులకు సుబ్బారావు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని సుబ్బారెడ్డిపాలెంకు చెందిన బోగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సుబ్బారెడ్డి పాలెం నుంచి కంకటపాలెం వైపు వెళ్తుండగా పట్టణంలోని దరివాదకొత్తపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం చీరాల నుంచి బాపట్ల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వరరెడ్డి (32) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి తండ్రిలేరు. తల్లి, ఒక సోదరుడు ఉన్నారు. కుటుంబం అంతా వెంకటేశ్వరరెడ్డిపైనే ఆధారపడి ఉంది. కొడుకు మృతిచెందడంతో కుటుంబానికి ఆధారం ఇంకెవరయ్యా అంటూ తల్లి రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ సీఐ రాంబాబు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement