భట్టిప్రోలు: ప్రభుత్వ ఉద్యోగులను పరుషపదజాలంతో ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేట్ అధ్యక్షులు పరిశ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో అధికారుల పట్ల ప్రవర్తించవద్దని సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం కొణిదల పవన్‌కల్యాణ్ ప్రజా ప్రతినిధులకు సీరియస్‌గా చెప్పాలని కోరారు. కొన్ని నిబంధనలు ఉంటాయని వాటికి అనుగుణంగానే పనులు చేస్తారని, క్రింది స్ధాయి నుండి పైస్థాయి వరకు అధికారులు ఉంటారని వారి అనుమతితోనే ఏ పనులైన చేస్తారనే విషయం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గమనించాలని అన్నారు. 2025 ఏడాదికి రావాల్సిన రెండు డీఏ బకాయిలు, 2026 సంవత్సరానికి రావాల్సిన ఒక డీఏ బకాయి విడుదల చేయలేదని పేర్కొన్నారు. అవి వెంటనే అమలు చేస్తే పిల్లల చదువులకు, గృహ లోన్‌లు తీసుకున్న వారికి ఈఎంఐలు తగ్గించుకోవచ్చునని, కొత్త లోన్లు తీసుకునే వారికి ఎక్కువ లోను వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీలు స్పందించి సీఎం, విద్యుత్ మంత్రి దృష్టికి వెంటనే తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం చేయగలరని అన్నారు. పెన్షనర్స్‌ను వారి ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే పీఆర్సీ జరిపించి మూడు డీఏ బకాయిలు చేయగలరని కోరారు.
విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పరిశ వెంకటేశ్వరరావు


