చిలకలూరిపేట టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతరోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే వీసా సురేష్ (34) కేటగిరింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి పది సంవత్సరాల కిందట మృతిచెందడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని ఎన్‌ఆర్టీ సెంటర్‌లో జాతీయ రహదారి దాటుతున్న సమయంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళుతున్న రూరల్ ఎస్సై చెల్లి రమేష్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని పట్టణంలోని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగై చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం జీజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని సోదరుడు సురేంద్ర ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు.


