బాపట్లటౌన్: సముద్రానికి హానికలిగిస్తే మానవ మనుగడకే ముప్పని ఫోరంఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పీసీ సాయిబాబు తెలిపారు. ఈనెల 8వ తేదీన ప్రపంచ సాగర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎంజీ ఉన్నత పాఠశాలలో సాగర దినోత్సవ కర పత్రాలను ఆవిష్కరించారు. డాక్టర్ పీసీ సాయిబాబు మాట్లాడుతూ సముద్రాల పట్ల మన ధృక్పథం మారాలన్నారు. ఇప్పటివరకు వాటిని మనం దోచుకోవడానికి ఒక అంతులేని నిల్వగా, మన వ్యర్థాల కోసం ఒక అంతులేని మురుగు కాలువగా పరిగణించామన్నారు. సముద్రాలపై మన జీవితాలు ఎంతగా ఆధారపడి ఉన్నాయో ముందుగా గుర్తించాలన్నారు. మనం పీల్చే ప్రతి రెండవ శ్వాస సముద్రం నుంచే ఉత్పత్తి అవుతుందన్నారు. సముద్ర జీవులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ప్రపంచంలోని ఆక్సిజన్‌లో సుమారు 50 నుంచి 80 శాతం వరకు ఉత్పత్తి చేస్తాయన్నారు. కోట్లాది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారన్నారు. మనం సముద్రానికి హాని చేసినప్పుడు, మనం పీల్చే గాలిని, మన సమాజాలను స్థిరపరిచే వాతావరణాన్ని, మనకు ఆహారం అందించే వ్యవస్థలను సముద్రం నేరుగా దెబ్బతీస్తాయన్నారు. మానవాళి మనుగడ కోసం సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎంఈఓ దేవరకొండ ప్రసాదరావు, సమగ్ర శిక్ష ఏపీఎం బిల్లా మోజస్, నాయకులు గురజాల శ్రీనివాసరావు, బడుగు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


