రొంపేరు కరకట్టలు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రొంపేరు కరకట్టలు ధ్వంసం

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

రొంపేరు కరకట్టలు ధ్వంసం

అడ్డగోలుగా మట్టి తరలింపు

పొంచి ఉన్న వరద ముప్పు

వేటపాలెం: రొంపేరు కరకట్టల మట్టిని జేసీబీలను ఉపయోగించి ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా తరలిస్తున్నారు. వేటపాలెం నుంచి సంతరావూరు వెళ్లే మార్గంలో రొంపేరు డ్రైనేజీ కాలువ గట్టు మట్టిని భారీ స్థాయిలో తరలిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రొంపేరు మురుగు కాలువ మధ్యలో వరద ప్రవాహానికి అడ్డుగా మేటలు వేసిన ప్రాంతంలోని మట్టి తరలింపు కోసం అనుమతి కోరారు. ఆ మేరకు అధికారులు కాలువ మధ్యలో మెరక ప్రాంతంలో 200 క్యూబిక్‌ మీటర్ల మేర తరలించుకోవడానికి అనుమతిచ్చారు. ఆ అనుమతి పత్రాన్ని అడ్డం పెట్టుకుని శనివారం, ఆదివారం రెండు రోజులపాటు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

తప్పని ఆందోళన

రాబోయే వర్షాకాలంలో రొంపేరు కరకట్టల పక్కనే ఉన్న పొలాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్టు బలహీనపడితే వరద నీరు గ్రామాలు, వ్యవసాయ భూములను ముంపునకు గురిచేసి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శమని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే కరకట్టలు ధ్వంసం చేసిన వారికి జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.

మెరక మట్టి తరలించేందుకే అనుమతి

రొంపేరు డ్రైనేజీ కాలువ మధ్యలో మెరక మట్టి తరలించుకోవడానికి మాత్రమే నిబంధనల మేరకు అనుమతిచ్చాం. కరకట్ట మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం

– కానియోలు, డ్రైనేజీ శాఖ ఏఈ, చీరాల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement