మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టు అన్యాయం

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టు అన్యాయం నరసరావుపేట: వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అన్యాయం, అక్రమమని గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బ్రహ్మనాయుడిని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేయటం అన్యాయం అన్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బొల్లా స్వయం కృషితో వ్యాపారం ప్రారంభించి తిరుమల, వల్లభ డెయిరీలు ఏర్పాటుచేసి పల్నాడు ప్రాంతంలో వందలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. తనకంటూ ఒక పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా గెలిచి ఒక చరిత్ర సృష్టించిన బొల్లాను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అతని కుటుంబ సభ్యులే తాము కొన్న భూమిలో అవకతవకలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేస్తే బొల్లాపైనే కేసు నమోదుచేసి అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ రాష్ట్రానికి చెందిన వారి ప్రోద్భలంతోనే బొల్లా అరెస్టు జరిగిందని, త్వరలో అన్నీ వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తాడని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, అతని కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌ తెలిపారు. పిడుగురాళ్ల పట్టణంలోని తన కార్యాలయంలో శనివారం విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ... వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి లేని స్థలం కోసం పాకులాడే వ్యక్తి కాదన్నారు. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వారిపైనే కేసులు నమోదు చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టు కోర్టు ద్వారానే తెల్చుకుంటామని అన్నారు.

బొల్లా అరెస్టు అక్రమం

బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తున్నారు

పిడుగురాళ్ల రూరల్‌: బాధితులనే నిందితులుగా చిత్రీకరించి చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పాలూరి అంజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బొల్లా రమేష్‌ రియల్‌ ఎస్టేట్‌ దళారుల మాటలు నమ్మి భూమి కొనుగోలు కోసం కేవలం అగ్రిమెంట్‌ మాత్రమే చేసుకున్నారని తెలిపారు. ఆ అగ్రిమెంట్‌ కూడా పూర్తిగా బొల్లా రమేష్‌ పేరుమీదనే ఉందని, ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదని ఆయన స్పష్టం చేశారు. భూములకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ తర్వాతే కొనుగోలు చేయాలని రమేష్‌ నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్‌ చేయించగా సంబంధించి జీవోలు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భూమి యజమానులుగా చెప్పుకొన్న వ్యక్తులు, దళారులపై తాము కేసులు నమోదు చేశామన్నారు. మోసాలను బయట పెట్టిన బొల్లా రమేష్‌ను నిందితుడిగా చిత్రీకరించటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బు సహాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడును కూడా దీనిలోకి లాగటం రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు బ్రహ్మనాయుడు పేరుతో కథనాలను ప్రచురించడం తగదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement