చెరుకుపల్లి: పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి ఎరువులు, విత్తనాలు, పంటనష్ట పరిహారం అందుతుందని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మి తెలిపారు. శనివారం మండలంలోని కావూరు గ్రామంలో కేత్ బచావో అభియాన్ పొలం సంరక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూఖ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సేంద్రియ ఎరువులు వినియోగించటం ద్వారా భూమిలో పోషకాలు పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి.రమేష్, బీడీ రామకృష్ణ, పృథ్వీరాజ్, మండల కోఆర్డినేటర్ రాహేల్‌రావు, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నాదెండ్ల: నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్‌ఐలు ఆర్.వెంకటేశ్వరరావు, అనిల్‌కుమార్, శివరామకృష్ణ సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారంపై అంకితభావం ఉండాలన్నారు.
కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం (ఏపీ ఏఓ) గుంటూరు, పల్నాడు జిల్లాల సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం గుంటూరు కిమ్స్– శిఖర హాస్పిటల్‌లో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి వ్యక్తికి 26 అంశాలలో పరీక్షలు నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 150 మంది సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.బాల భాస్కర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి.ప్రవీణ్, ట్రెజరర్ డాక్టర్ బి.మురళి కిశోర్, సెక్రటరీ డాక్టర్ కె.అమల కుమారి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


