బాపట్ల టౌన్: భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన నేల అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యవసాయ విద్యార్థిపై ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పి.వి. సత్యనారాయణ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాల బి.వి.నాథ్ ఆడిటోరియంలో శనివారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విచక్షణరహితంగా ఎరువులను, పురుగుమందులను వాడటం వలన నేలసారం గణనీయంగా తగ్గిందన్నారు. ఈ పరిస్థితిని నివారించకపోతే భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించడం సాధ్యం కాదన్నారు. భారతీయ నేలలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని పేర్కొన్నారు. ఇది నేల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. మట్టిలో పోషక విలువలు తగ్గిపోవటం ఆందోళన కలిగించే విషయమన్నారు. యాభై ఏళ్ల క్రితం ఎటువంటి రసాయనాలను వినియోగించకుండానే ఆరోగ్యవంతమైన చక్కని దిగుబడులు పొందామని, నేడు ఎరువులు, పురుగుమందులను తప్పనిసరిగా వాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు కృషి చేయాలని, సాగు భూమిని పరిరక్షించుకోవాలన్నారు. అందుకు జీవ ఎరువులను, సేంద్రియ పోషక పదార్థాలను వాడాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు వ్యవహరించాలని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, నేల కోతను నివారిస్తూ పర్యావరణ పరిరక్షణ పట్ల జాగ్రత్తలు పాటిస్తే సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో తమ విద్యను సద్వినియోగం చేయాలని తెలిపారు. రైతుల చెంతకు స్వయంగా వెళ్లి, వారికి అవగాహన కల్పించాలన్నారు. సమీకృత పోషకాహార నిర్వహణ, సాయిల్ హెల్త్ కార్డులను ఉపయోగించుకునే విధానం, నేలను సారవంతం చేసే పంట వైవిధ్యం గురించి వివరించాలన్నారు. అనంతరం బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వరకు వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. సి.హెచ్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. మణి, ఎన్టీఆర్ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ ఇన్‌చార్జి డా. జి.రవి బాబు, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డా.ఎం.సర్దార్ బేగ్, డా. కె.ఎస్.ఆర్.పాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


