నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు

తెనాలి: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్‌ 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజులపాటు నిర్వహించనున్న పోటీల బ్రోచర్‌ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించారు. నాలుగురోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల్నుంచి 10.30 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభసభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, సభాధ్యక్షులుగా అజో విభో కందాళం ఫౌండేషన్‌ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు, నటుడు ఎన్‌.రవీంద్రరెడ్డికి ప్రదానం చేయనున్నారు. తొలిరోజున ఆరు గంటలకు కళాహారతి తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించనున్నారు. ఉమా రచించిన ఈ నాటికకు నాట్యాచార్య ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. సభానంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 9.15 గంటలకు ఆరాధనా ఆర్ట్స్‌, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శిస్తారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు. బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ్‌, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ నాయకులు జి.వేణుగోపాలరెడ్డి, అక్కిదాసు కిరణ్‌కుమార్‌, మైలా విజయ్‌నాయుడు, చుక్కా ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement