మద్యంలో ముంచేస్తారా? | - | Sakshi
Sakshi News home page

మద్యంలో ముంచేస్తారా?

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

● సూర్యలంక బీచ్‌లో మద్యం విక్రయాలకు చంద్రబాబు సర్కార్‌ సిద్ధం ● ఇప్పటికే మద్యం మత్తులో తీరంలో మునిగి చనిపోతున్న పర్యాటకులు ● ఇప్పటికే సూర్యలంక, రామాపురం, ఓడరేవు బీచ్‌లలో అనధికారిక మద్యం విక్రయాలు ● రిసార్ట్‌ల్లో అడ్డగోలుగా పేకాట, రేవ్‌ పార్టీల నిర్వహణ ● చంద్రబాబు ప్రభుత్వం కాసుల యావపై పర్యాటకుల ఆగ్రహం

పెరిగిన రేవ్‌ పార్టీలు

బీచ్‌ షాక్స్‌కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి

పచ్చ నేతల ధనదాహం

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బీచ్‌ షాక్స్‌ అంటే.. చిన్నపాటి కుటీరాలు ఏర్పాటు చేసి వాటిల్లో మద్యం, బీరు, ఇతర మత్తు పానీయాలు, ఆహార పదార్థాలు విక్రయిస్తారు. ఈ లెక్కన బీచ్‌లలో కుటీరాలను మద్యం షాపులుగా, బార్లుగా మార్చనున్నారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం ముసుగులో మద్యం విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ రాత్రంతా ఇవి కొనసాగేందుకే అవకాశాలు ఉన్నాయి.

యువత ప్రాణాలకు ముప్పు

బీచ్‌లలో మద్యం, బీర్లు అమ్మకాలు సాగితే వాటిని తాగి పర్యాటకులు ముఖ్యంగా యువత సముద్ర జలాల్లోకి దిగే అవకాశముంది. మద్యం మత్తులో వారు సముద్రం లోతుల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే ఏటా బాపట్ల సూర్యలంక, చీరాల ప్రాంతంలోని ఓడరేవు, రామాపురం బీచ్‌లలో మద్యం తాగి సముద్రంలోకి దిగి పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇప్పటివరకూ సూర్యలంకతోపాటు చీరాల తీరప్రాంతంలోని బీచ్‌లలో మద్యం అమ్మకాలకు అనుమతులు లేవు. సూర్యలంక హరిత రిసార్ట్‌లో బార్‌ నడుపుతున్నా.. బయట మద్యం దుకాణాల కంటే ఇక్కడ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. పైగా రిసార్ట్‌లో మద్యం తాగిన తరువాత వారిని బీచ్‌లోకి అనుమతించరు. ఇక్కడ ఆ మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. కానీ అనధికారికంగా అన్ని బీచ్‌లలో మద్యంతోపాటు బీర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక బయట నుంచి తెచ్చుకొని బీచ్‌లలో మద్యం తాగేవారు కోకొల్లలు. సూర్యలంకలో ‘బీచ్‌ షాక్స్‌’కు అధికారికంగా ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో బీచ్‌లలో మద్యం ఏరులై పారనుంది. సూర్యలంక బీచ్‌ పక్కనే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విభాగం ఉండటంతో ఇక్కడ రక్షణ పరంగానే కాక చేపలవేట లేక బీచ్‌ పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా అటు తెలంగాణ నుంచి పర్యాటకులు కుటుంబాలతో వస్తున్నారు. ఇక్కడే వారాంతాలు గడిపి తిరిగి వెళుతున్నారు. బీచ్‌లో ఇప్పటివరకూ మద్యం అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో పర్యాటలకుల తాకిడి పెరిగింది. ఇక నుంచి సూర్యలంక బీచ్‌లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధమవడంతో పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. మద్యం విక్రయాలు జరిగితే బీచ్‌లో ప్రశాంత వాతావరణం పాడై అసాంఘిక కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో బీచ్‌లో అలజడులు పెట్రేగుతాయి. ప్రమాద మరణాలు పెరిగే అవకాశముంది.

అందుబాటులో గోవా మద్యం

ఇప్పటికే బాపట్ల సూర్యలంకతోపాటు చీరాల ప్రాంతంలోని రిసార్ట్‌లలో రకరకాల మద్యం అందుబాటులో ఉంది. ప్రధానంగా కొందరు అక్రమ వ్యాపారులు గోవా నుంచి మద్యం తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రిసార్ట్‌లలో మద్యం విక్రయాలతోపాటు పేకాట ఇతర జూదం పెద్ద ఎత్తున సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి చాలా మంది చీరాల, బాపట్ల రిసార్ట్‌లకు వచ్చి పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో మద్యం తాగడానికి, జూదం ఆడడానికి రిసార్ట్‌లు మేలని జూదరులు, మద్యం ప్రియులు భావిస్తున్నారు. రిసార్ట్‌లు కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరిగినట్లు ఆరోపణలున్నాయి. పోలీసు లేదా రెవెన్యూ ఇతర ఉన్నతాధికారులు బీచ్‌లు సందర్శించినప్పుడు వారి కోసం రిసార్ట్‌ల యజమానులను రూములు అడగాల్సి వస్తుండడంతో.. రిసార్ట్‌లలో తనిఖీలకు వెళ్లే పరిస్థితి లేదని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. రెవెన్యూ అధికారులదీ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. తనిఖీలు ఉండవన్న ధైర్యంతోనే కొన్ని రిసార్ట్‌లలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు.

ఇటీవల చీరాల బీచ్‌లలో రేవ్‌ పార్టీల జోరు పెరిగింది. పలు రిసార్ట్‌లు గుట్టు చప్పుడు కాకుండా ఈ పార్టీలు నిర్వహిస్తున్నాయి. కొందరు సినిమా నటీమణులు, టీవీ సీరియళ్ల యాక్టర్లను సైతం పిలిపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రామాపురం బీచ్‌లో మద్యం అమ్మకాల సందర్భంగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన పర్యాటకులపై స్థానిక మద్యం విక్రయదారులు దాడులు చేసి కొట్టారు. రామాపురం మొదలు పొట్టిసుబ్బయ్యపాలెం వరకూ బీచ్‌లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎటువంటి చర్యలు ఉండడం లేదు.

మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు బీచ్‌లను వదలని చంద్రబాబు సర్కార్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

ప్రశాంతంగా ఉండే సూర్యలంక బీచ్‌లో ఇక నుంచి అలల అలజడి కంటే మద్యం సీసాల గలల పెరగనుంది. సూర్యలంక బీచ్‌లో ‘బీచ్‌ షాక్స్‌’కు గురువారం రాష్ట్ర మంత్రి మండలి ఓకే చెప్పడం పర్యాటకుల్లో ఆందోళన రేపుతోంది. పర్యాటకుల ప్రాణాలు, వారి ఆహ్లాదం, భద్రత కంటే ఆదాయంపై చంద్రబాబు సర్కార్‌ దృష్టి పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

సూర్యలంక బీచ్‌లో బీచ్‌ షాక్స్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపడంతో బీచ్‌లో మద్యం అమ్మకాల కోసం నియోజకవర్గంలోని పచ్చ నేతలు ఎగబడుతున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాల హక్కుల కోసం కొందరు నేతలు శుక్రవారం నియోజకవర్గ ముఖ్య నేత ఇంటి వద్ద క్యూ కట్టినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మద్యం సిండికేట్‌ నిర్వహిస్తున్న పచ్చ నేత... బీచ్‌లో మద్యం అమ్మకాల వ్యవహారాన్ని మద్యం సిండికేట్‌కు అప్పగించడమా? ఆదాయం వస్తుందనుకుంటే.. తామే మనుషులను పెట్టి సొంతంగా నిర్వహించడమా? అనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement