చీరాల రూరల్: పర్యావరణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అది అందరి బాధ్యతని సీనియర్ సివిల్ జడ్జి బి. బేబిరాణి అన్నారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కోర్టు భవన సముదాయంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి బి.బేబిరాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకట వాహిని ముఖ్య అతిథులుగా పాల్గొని న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. న్యాయమూర్తులు మాట్లాడారు. పర్యావరణం పదికాలాల పాటు పదిలంగా ఉండాలన్నా మనుగడ సాగించాలన్నా ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ఇంటికొక మొక్క చొప్పున నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మన మిచ్చే కానుక అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గౌరవ రమేష్‌బాబు, నాదెండ్ల రాజు, ఆసాది రామకృష్ణా రెడ్డి, మల్లారపు రామకృష్ణ, బిళ్లా ఆరోగ్యరావు, చిక్కాల రామారావు, మహిళా న్యాయవాదులు స్నేహ, జాస్మిన్, పిఎల్‌సి కృష్ణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్‌ఆర్‌అండ్‌పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. హైస్కూలు ఆవరణలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటారు. క్రీడాకారులకు, వాకర్స్‌కు, విద్యార్థులకు మంచి వాతావరణంతో పాటు చెట్లు చల్లని నీడనిస్తాయని వారు పేర్కొన్నారు. చారుగుళ్ల గురుప్రసాద్, దోగుపర్తి సురేష్, కొత్తమాసు శ్రీనివాసరావు, రమేష్, ఉమా మహేశ్వరరావు, డి.నారాయణ, శివాంజనేయప్రసాద్, ఎంఎస్. సుబ్బారావు, ఎం. సత్యనారాయణ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ యువత బాధ్యత
బాపట్ల: అనూహ్యమైన వాతావరణ మార్పుల వలన పర్యావరణం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, దానిని పరిరక్షించుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు సంభవిస్తుందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఇన్‌చార్జి డాక్టర్ కె.చంద్రశేఖర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కళాశాలలో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మనకు రక్షక కవచంగా నిలిచే ప్రకృతిని కాపాడుకునేందుకు వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మొక్కలు పెంపకం, పరిశుభ్రత, వాతావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు దోహదపడతాయని, అందువలన భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందన్నారు. వ్యర్థాల రీసైక్లింగ్ వంటి సామాజిక కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించడం ద్వారా అందమైన ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని సృష్టించుకోవచ్చని తెలిపారు. డాక్టర్ యం.శ్రీరేఖ, డాక్టర్ పార్ధసారధి పర్యావరణ పరిరక్షణకు యువత చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. బాల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్ సంస్థ కళాశాలకు నాలుగు పొడి చెత్త డస్ట్ బిన్లను అందించింది. బాలుర వసతి గృహాలను శుభ్రపరిచారు. పర్యావరణ అంశంపై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.


