గుంటూరురూరల్: సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం పరిరక్షించబడటమే కాకుండా పంటల నాణ్యత, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతుందని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అన్నారు. నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం, వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధనా సంస్థ (అటారీ) జోన్–పది సంయుక్తంగా ఖేత్ బచావో అభియాన్ (పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) నిర్వహించారు. ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన సదస్సును విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతులకు నేల పరీక్షలు, పోషక నిర్వహణ పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని నేల ఆరోగ్య కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులు కోరారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ ఒక్క అంగుళం నేల ఏర్పడటానికి 500 సంవత్సరాలు సమయం పడుతుంటే, మనం విచక్షణ రహితంతంగా రసాయనాలు వాడటం వలన 5 నిముషాలలో దీనిని నాశనం చేస్తున్నామన్నారు. దీనిని మానుకొని భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడకోవాలని సూచించారు. లాం పరిశోధన స్థానం మృత్తికాశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విన్నకోట, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము పంటలు తొలకరిలో వేసుకొని భూమిలో కలియ దున్నడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నేల నీటి నిల్వ సామర్థ్యం సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రసాయన ఎరువుల అవసరం కొంత మేర తగ్గి, సాగు వ్యయాలు కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. యడ్లపాడుకు చెందిన ప్రగతిశీల రైతు శివరామకృష్ణ మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమన్వయం పాటించి సమతుల్యతను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అటారీ జోన్–పది శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ భాస్కరన్, ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్‌లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


