పారదర్శకంగా ఓటరు జాబితా పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా పరిశీలన

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

బీచ్‌లలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం

జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌

రేపల్లె: ఓటరు జాబితా తుది ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, ఇందులో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. గురువారం రేపల్లె మున్సిపల్‌ కార్యాలయం సమావేశ మందిరంలో పట్టణంలోని బూత్‌ లెవెల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల పేర్లను తొలగించడంలో నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా పరిశీలన చేపట్టి కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి ప్రక్రియలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతోపాటు పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రతి బూత్‌ లెవెల్‌ అధికారి తన పరిధిలో పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబెట్టేలా కృషి చేయాలని పేర్కొన్నారు. నిజాంపట్నం మండలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీఎల్‌ఓ మేడికొండ భాగ్యరాజుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం 33.25 శాతం మాత్రమే పరిశీలన పూర్తి చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ఓటర్ల జాబితా మ్యాపింగ్‌పై ఓ ఇంటికి వెళ్లి పరిశీలించారు. సాయిబాబా ఆలయ సమీపంలోని సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో భూసి శ్రీదేవి, తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు, మున్సిపల్‌ డీఈ మధుసూదనరావు, ఎన్నికల విభాగం అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, బూత్‌ లెవెల్‌ అధికారులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. 2006 జూన్‌ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని వీక్షణ సమావేశ మందిరంలో వాల్‌ పోస్టర్‌, బ్యానర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటి సంరక్షించడం, ఇంట్లో తడి, పొడి చెత్తగా వేరు చేసి సంబంధిత మున్సిపల్‌ సిబ్బందికి అందజేయడం, మురుగు నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ నారాయణభట్టు, రెడ్‌ క్రాస్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల: సూర్యలంక, రామాపురం, ఓడరేవు బీచ్‌లలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలోని బీచ్‌లలో నిర్వహించాల్సిన అంశాలపై గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని మినీ వీసీ హాల్‌ నుంచి ఇన్‌చార్జి పర్యాటక శాఖ అధికారి, బీచ్‌ సూపర్‌వైజర్లతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... బీచ్‌ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పర్యాటకుల భద్రత ముఖ్యమని చెప్పారు. గజ ఈతగాళ్లు, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. బీచ్‌లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి పర్యాటక అధికారి ఆనంద్‌ సత్యపాల్‌, గ్రామ / వార్డు సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement