కాలువల మరమ్మతులకు రూ.42.19 కోట్లు | - | Sakshi
Sakshi News home page

కాలువల మరమ్మతులకు రూ.42.19 కోట్లు

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

కొనసాగుతున్న ఏపీ పీసెట్‌–2026 48 గ్యాస్‌ సిలిండర్ల స్వాధీనం సాగర్‌ నీటిమట్టం

నరసరావుపేట: నాగార్జున సాగర్‌ కుడి కాలువ పరిధిలోని కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఏడాదిలో 578 ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. కాలువ కట్టల బలోపేతం, పూడిక తీత, నీటి నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, గేట్లు, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో సుమారు 290 పనులను గుర్తించి ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సాగర్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్‌–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరవ్వాలని రెక్టార్‌ ఆర్‌. శివరాంప్రసాద్‌ అన్నారు. ఏఎన్‌యూలో ఎనిమిది రోజులపాటు జరిగే ఏపీ పీసెట్‌ పరీక్షలకు రెండవ రోజు గురువారం 715 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాల్‌కుమార్‌ తెలిపారు. 5వ తేదీన హాల్‌టికెట్‌ నెంబరు 11431 నుంచి 12144 వరకూ మొత్తం 713 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

మాచర్ల రూరల్‌: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 48 సిలెండర్లను స్వాధీనపరుచుకున్న సంఘటన పట్టణంలోని శ్రీశైలం రోడ్డు, బ్రహ్మ బోర్‌వెల్స్‌లో చోటుచేసుకుంది. తహసీల్దార్‌ బి.కిరణ్‌కుమార్‌ నేతృత్వంలో గురువారం పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. శ్రీశైలం రోడ్డులోని బ్రహ్మ బోర్‌వెల్స్‌, కృష్ణ బలిజ కాలనీ, ఆర్చీ పక్కన గల షాపులలో తనిఖీ చేసి చిన్ని శ్రీనివాసరావు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 48 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ ఏజెన్సీ నుంచి వివిధ పేర్లతో డెలివరీ తీసుకొని తన షాపులో నిల్వ ఉంచుకొని బ్లాకులో ఒక్కొక్కటి రూ. వేల చొప్పున విక్రయిస్త్తున్నట్లు ఆరోపణలు రావటంతో తహసీల్దార్‌ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. శ్రీనివాసరావుపై 6 ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తహసీల్దార్‌ తెలిపారు. దాడుల్లో సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ షేక్‌ బాషా, ఆర్‌ఐ అనిల్‌కుమార్‌, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 519.60 అడుగులకు చేరింది. ఇది మొత్తం 148.5482 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి కుడి కాలువకు 7,033, ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 7,933 క్యూసెక్కులు విడుదల అవుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement